
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు అగ్రవర్ణాల కంటే మూడు రెట్లు ఎక్కువ వెనుకబడి ఉన్నారని నివేదిక వెల్లడించింది. బీసీలు కూడా అగ్రవర్ణాల కంటే 2.7 రెట్లు వెనుకబడి ఉన్నారు. మొత్తం 242 కులాల్లో 135 కులాలను ‘అత్యంత వెనుకబడినవి’గా గుర్తించారు. ఈ 135 కులాల్లోనే రాష్ట్ర జనాభాలో 67 శాతం మంది ఉన్నారు. ఈ కులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ వెనుకబడి ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఎస్టీల్లో 99 శాతం, ఎస్సీల్లో 97 శాతం, బీసీల్లో 71 శాతం మంది ప్రజలు రాష్ట్ర సగటు కంటే వెనుకబడి ఉండటం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు, అగ్రవర్ణాలకు చెందిన 18 కులాలూ రాష్ట్ర సగటు కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నాయని సీబీఐ ర్యాంకింగ్స్ స్పష్టం చేశాయి.
తెలంగాణలోని 78.2 శాతం కుటుంబాల వార్షిక ఆదాయం లక్ష కంటే తక్కువగానే ఉందని నివేదిక విస్తుపోయే నిజం చెప్పింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే, ఎస్టీల్లో 88.2 శాతం, ఎస్సీల్లో 86.2 శాతం కుటుంబాలు ఈ పేదరికపు కోరల్లోనే చిక్కు కుని ఉన్నాయి.
ALSO READ : హైవేలపై ప్రయాణించే వారికి హెచ్చరిక
అదే సమయంలో అగ్రవర్ణాల్లో దాదాపు సగం మంది అంటే 43.8 శాతం కుటుం బాలు లక్ష కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నా యి. రూ. 5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిలో అగ్రవర్ణాల వారు 13.2 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఎస్సీ, ఎస్టీలు కేవలం 2.1 శాతం మాత్రమే ఉన్నారు. ఇన్‌కమ్ టాక్స్ కడుతున్న వారిలో 23.5 శాతం మంది అగ్రవర్ణాల వారే కావడం ఆర్థిక కేంద్రీకరణను సూచిస్తోంది.
ALSO READ : డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం
అగ్రవర్ణాల్లో ప్రైవేటు చదువులు.. ఎస్సీ ఎస్టీలు సర్కార్ బడులకే..
విద్యారంగంలో సామాజిక వర్గాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని నివేదిక ఎత్తిచూపింది. అగ్రవర్ణాలకు చెందిన పిల్లల్లో 34 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతుండగా, ఎస్సీల్లో 15 శాతం, ఎస్టీల్లో కేవలం 13 శాతం మందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతోంది. ఉన్నత విద్య (డిప్లొమా అంతకంటే ఎక్కువ) సాధించిన వారిలో అగ్రవర్ణాల వారు 57 శాతంతో ముందుండగా, ఎస్టీలు కేవలం 31 శాతంతో వెనుకబడి ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యలోనూ అగ్రవర్ణాల యువత 66 శాతంతో దూసుకుపోతుండగా, ఎస్టీ యువత 36 శాతానికే పరిమితమైంది. ఈ విద్యా అసమానతలే భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వెనుకబాటుకు పునాది వేస్తున్నాయి.