
రాష్ట్రంలో 36 లక్షల 57 వేల 551 (10.3%) జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజికవర్గంగా నిలిచింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణన సర్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం బుధవారం బయటపెట్టింది. ఉపకులాలవారీగా జనాభా వివరాలను వెల్లడించింది. మాదిగ కులం తర్వాత 27 లక్షల 95 వేల 727 (7.9%) మందితో షేక్ ముస్లింలు రెండోస్థానంలో నిలవగా, 26 లక్షల39 వేల 027 (7.4%) మందితో ముదిరాజ్ సామాజిక వర్గం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ ముదిరాజ్కులం జనాభా పరంగా బీసీల్లో అతి పెద్ద సామాజికవర్గంగా అవతరించింది. గిరిజన తెగల్లో 24,04,056 (6.8%) మందితో లంబాడాలు, వెనుకబడిన తరగతుల్లో 20,18,725 (5.7%) మందితో యాదవులు, 16,30,187 (4.6%) మందితో గౌడ సామాజిక వర్గాలు తమ సంఖ్యాబలాన్ని చాటుకోగా, ఓపెన్ కేటగిరీలో 17,10,244 (4.8%) జనాభాతో రెడ్డి సామాజిక వర్గం టాప్లో నిలిచింది.
ALSO READ : వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకుంటున్న..
బీసీ (బీ) వర్గాల్లో గౌడ, పద్మశాలీల ఆధిపత్యం
బీసీ(-బీ) విభాగంలో వృత్తి కులాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం 16,30,187 (4.6%) జనాభాతో ఈ కేటగిరీలో పెద్ద కులంగా నిలిచింది. కల్లు గీత వృత్తిపై ఆధారపడిన ఈ వర్గం, సామాజికంగా 77 సీబీఐ స్కోరును కలిగి ఉంది. చేనేత రంగంపై ఆధారపడిన పద్మశాలీ కులం 11,82,252 (3.3%) జనాభాతో రెండో స్థానంలో ఉంది. ఈ వర్గం సీబీఐ స్కోరు 67గా ఉంది, ఇది కొంత మెరుగైన స్థితిని సూచిస్తున్నప్పటికీ, వృత్తిపరమైన సంక్షోభాల వల్ల వీరు ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇదే విభాగంలోని కురుమ / కురుబ కులం 7,95,822 (2.2%) సంఖ్యతో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తోంది. బీసీ-బీలో ఉన్న ఈ ప్రధాన వృత్తి కులాల జనాభా కలిపితే దాదాపు 10 శాతానికి చేరువలో ఉంది. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా నిధుల మళ్లింపు అత్యవసరమని సర్వే నివేదిక సూచించింది.