
మూడు నెలలకు పైగా కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క తిరిగి రావడంతో ఓ యజమాని తన మొక్కును ఘనంగా తీర్చుకున్నాడు. గుజరాత్‌లో జరిగిన.. హృదయాలను హత్తుకునే ఈ ఘటన నెట్టింట వైరల్ అయ్యింది.
సమాచారం ప్రకారం…. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఓ వ్యక్తి హోటల్ నడుపుతున్నాడు. అతని దగ్గర ‘టైగర్’ అనే లాబ్రడార్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఉంది. సుమారు మూడున్నర నెలల క్రితం ఆ కుక్క ఎటో వెళ్లిపోయింది. ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆ యజమాని తీవ్రంగా బాధపడ్డాడు. అయితే కుక్క క్షేమంగా తిరిగి వస్తే, తన ఇంటికి దగ్గర్లోని ప్రముఖ అంబాజీ ఆలయానికి కాలినడకన వస్తానని దేవుడికి మొక్కుకున్నాడు.
ఆశలు వదులుకొని… చివరికి ఎలాంటి ఆశ లేని సమయంలో, ఆ కుక్క ఒక్కసారిగా దానంతట అదే యజమాని హోటల్ వద్దకు తిరిగి వచ్చింది. అటుగా రిక్షాలో వస్తున్న టైగర్.. తన యజమాని గొంతును గుర్తించి, వెంటనే రిక్షా దిగి పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని హత్తుకుంది. 3 నెలలకి పైగా పెంపుడు కుక్క కనిపించకపోవడంతో కంగారు పడిన ఆ కుటుంబానికి ఈ కలయిక ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
ఘనంగా మొక్కు తీర్చుకున్న యజమాని
కోరిన మొక్కు ప్రకారం.. హోటల్ యజమాని తన సిబ్బందితో కలిసి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాజీ ఆలయానికి కాలినడకన బయలుదేరాడు. ఈ యాత్రలో ఆ అదృష్ట కుక్క ‘టైగర్’ కూడా వారితో పాటు నడిచింది. దారి పొడవునా పాటలకు డ్యాన్సులు చేస్తూ, ఈ ఆధ్యాత్మిక నడకను ఆనందకరమైన ఊరేగింపులా మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.