Reading Time: 2 minutes
Bochha Fish: చిక్కిందండోయ్ సరైన బొచ్చ  చేప.. ఇంతకీ దీని ప్రత్యేకతలు తెలుసా..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలాశయానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా తరలిస్తున్న నీటిలో భారీ బొచ్చ చేప మత్స్యకారుడి వలకు చిక్కడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. సుమారు 30 కిలోల బరువున్న ఈ చేపను నీటిలో నుంచి బయటకు తీసేందుకు ముగ్గురు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇంత భారీ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్ నుంచి ఎల్లంపల్లి జలాశయం నీటిని వరద కాలువ ద్వారా మిడ్ మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. ఈ నీటి ప్రవాహం వరదవెల్లి దత్తాత్రేయ స్వామి గుట్ట సమీపంలోని వరద కాలువ చివరి భాగంలో మిడ్ మానేరు జలాశయంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో చేపలు ఎక్కువగా లభిస్తాయని భావించి రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన మత్స్యకారులు ప్రతిరోజూ ఇక్కడ చేపల వేట సాగిస్తున్నారు.

ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన మత్స్యకారుడు రాజ్‌కుమార్ ఆదివారం వల వేయగా, అందులో సుమారు 30 కిలోల బరువున్న బొచ్చ రకం చేప చిక్కింది. చేప భారీగా ఉండటంతో ఒక్కరితో దానిని పైకి లాగడం సాధ్యపడలేదు. దీంతో మరో ఇద్దరు మత్స్యకారులు సహాయం చేయగా ఎంతో శ్రమించి ఒడ్డుకు చేర్చగలిగారు. చేపను ఒడ్డుకు తీసుకొచ్చిన వెంటనే అక్కడున్న ఇతర మత్స్యకారులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు చేపతో ఫొటోలు దిగగా, మరికొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

మత్స్యకారులకు గతంలో ఈ ప్రాంతంలో 20 నుంచి 22 కిలోల వరకు బరువున్న చేపలు చిక్కిన సందర్భాలు ఉన్నప్పటికీ, 30 కిలోల బరువున్న బొచ్చ చేప లభించడం చాలా అరుదైన ఘటన అని తెలిపారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి వరద కాలువ ద్వారా విడుదలవుతున్న నీటితో పాటు పెద్ద పరిమాణంలో ఉన్న చేపలు కూడా మిడ్ మానేరుకు చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. నీటి ప్రవాహం కొనసాగిన ప్రతిసారి భారీ చేపలు వలకు చిక్కే అవకాశాలు ఉంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

మిడ్ మానేరు జలాశయం పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా మత్స్య సంపద పెరుగుతోందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. నీటి లభ్యత మెరుగుపడటం, వరద కాలువ ద్వారా నిరంతరం నీరు చేరుతుండటంతో చేపల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతానికి వివిధ జిల్లాల నుంచి మత్స్యకారులు వచ్చి చేపల వేట సాగిస్తున్నారని తెలిపారు.

ఈ చేప ప్రత్యేకతలు:

భారతీయ ప్రధాన కార్ప్ జాతి: భారతదేశంలోని మూడు ప్రధాన కార్ప్ చేపలలో ఇది కూడా ఒకటి.

భారీ పరిమాణంలో పెరుగుతుంది: అనుకూల పరిస్థితుల్లో 20–40 కిలోల వరకు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ బరువు కూడా పెరుగుతుంది.

పెద్ద తల ప్రత్యేకత: శరీరంతో పోలిస్తే తల పెద్దగా, నుదురు వెడల్పుగా ఉండటం బొచ్చ చేప ప్రధాన లక్షణం.

వేగంగా పెరుగుతుంది: మంచి నీరు, సమృద్ధిగా ఆహారం లభిస్తే వేగంగా ఎదుగుతుంది. అందుకే చేపల పెంపకంలో దీనికి ప్రాధాన్యం ఎక్కువ.

మంచినీటి చేప: నదులు, జలాశయాలు, చెరువులు, రిజర్వాయర్లలో ఎక్కువగా జీవిస్తుంది.

ఆహారం: ప్రధానంగా నీటిలోని ప్లాంక్టన్ (సూక్ష్మ జీవులు), ఆల్గే వంటి సహజ ఆహారాన్ని తీసుకుంటుంది.

మంచి మార్కెట్ డిమాండ్: రుచికరమైన మాంసం, అధిక బరువు కారణంగా మార్కెట్లో మంచి ధర పలుకుతుంది.

ఆక్వాకల్చర్‌లో కీలకం: దేశవ్యాప్తంగా చేపల పెంపకంలో అత్యధికంగా పెంచే జాతుల్లో బొచ్చ ఒకటి.

ఆయుష్షు: అనుకూల పరిస్థితుల్లో 15–20 సంవత్సరాల వరకు జీవించగలదు.

పర్యావరణ ప్రాధాన్యం: జలాశయాల్లో సహజ ఆహార గొలుసులో కీలక పాత్ర పోషించడంతో పాటు చేపల ఉత్పత్తిని పెంచడంలో దోహదపడుతుంది.

కట్లా చేపలు సాధారణంగా నీటి పైభాగం, మధ్య భాగంలో సంచరిస్తాయి. మిడ్ మానేరు, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి వంటి పెద్ద జలాశయాల్లో తగినంత నీరు, ఆహారం లభిస్తే 25–30 కిలోలకు పైగా పెరగడం అసాధారణం కాదు. అందుకే అప్పుడప్పుడు మత్స్యకారుల వలకు ఇలాంటి భారీ బొచ్చ చేపలు చిక్కుతుంటాయి.