Reading Time: 2 minutes
Rashmika Mandanna Injury Update Hip Tendon Injury During Maisa Shoot

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవల ‘మైసా’ షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు ఓ సుదీర్ఘ పోస్ట్ ద్వారా వివరాలు వెల్లడించారు. “గాయాలు అసలు నచ్చవు.. ఎవరికి తెలియకూడదని అనుకున్నా.. కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది” అంటూ రష్మిక తన పోస్ట్‌ను ప్రారంభించారు. వరుసగా ఇది తనకు మూడో గాయం అని, తన శరీరాన్ని మెషిన్‌లా కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలని పేర్కొన్నారు.

తనకు ఎదురైన గాయం గురించి వివరిస్తూ.. హిప్ ప్రాంతంలోని నాలుగు టెండన్లలో ఒకటి విడిపోయిందని, అది మళ్లీ కలిసే వరకు కాలు పైకి ఎత్తడం వంటి కదలికలు కష్టమవుతాయని అన్నారు. ఈ గాయం తన తాజా చిత్రం ‘మైసా’ షూటింగ్ సమయంలో డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా జరిగిందని వెల్లడించారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యంత యాక్షన్, ఎనర్జిటిక్ మూవీగా అనిపిస్తోందని సరదాగా చెప్పారు. ప్రస్తుతం తనకు నొప్పి ఉన్నప్పటికీ భరించలేనంతగా లేదని, వైద్యుల సూచనలతో విశ్రాంతి తీసుకుంటున్నానని రష్మిక తెలిపారు. ఈ గాయాల కారణంగా వచ్చిన ఖాళీ టైంని ఫోర్స్‌డ్ హాలిడేగా భావిస్తున్నానని, ఖాళీ సమయంలో పజిల్స్ చేస్తూ గడుపుతున్నానని చెప్పారు. అలాగే వర్కౌట్స్, రన్నింగ్‌కు దూరంగా ఉండాల్సి రావడంతో బరువు పెరుగుతానేమోనని సరదాగా ఆందోళన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తానని రష్మిక చెప్పుకొచ్చారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.