
ఐపీఎల్ స్టార్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ ఛత్తీస్‌గఢ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2026-27 దేశీయ సీజన్‌కు ఆ రాష్ట్ర జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. నిరభ్యంతర పత్రం (NOC) పొందిన శశాంక్ ఇకపై పుదుచ్చేరి జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ముంబై వికెట్ కీపర్-బ్యాటర్ ప్రసాద్ పవార్ కూడా అతనితో కలిసి పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
పట్టించుకోవడం లేదు..
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శశాంక్ సింగ్.. గత సీజన్‌లో భుజానికి తీవ్ర గాయం, చేతి వేలికి ఫ్రాక్చర్ అయినప్పటికీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర క్రికెట్ సంఘం తనకు ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించాడు. పునరావాసం, కోలుకునే ప్రక్రియలో అవసరమైన మద్దతు పూర్తిగా లేకపోయిందని పేర్కొన్నాడు. ఛత్తీస్‌గఢ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌తో పాటు బెంగళూరులో నిర్వహించిన ప్రీ-సీజన్ శిక్షణ శిబిరానికి కూడా తనను ఎంపిక చేయలేదని శశాంక్ తెలిపాడు. కారణం ఏమిటని అడిగినా సంఘం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వెల్లడించాడు.
ఐపీఎల్ మాత్రమే..
తాను దేశీయ క్రికెట్‌పై ఆసక్తి చూపడం లేదని, కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడాలనుకుంటున్నానని తప్పుడు ప్రచారం చేశారని శశాంక్ ఆరోపించాడు. అయితే వాస్తవానికి 2023-24 సీజన్‌లో దేశీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా బీసీసీఐ లాలా అమర్‌నాథ్ అవార్డు అందుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. ఆ అవార్డు తన దేశీయ క్రికెట్ పట్ల అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నాడు.
వైట్‌బాల్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి
ఈ సీజన్‌లో రెడ్‌బాల్ క్రికెట్‌కు విరామమిచ్చి, వన్డేలు, టీ20ల వంటి వైట్‌బాల్ క్రికెట్‌పైనే దృష్టి పెట్టనున్నట్లు శశాంక్ వెల్లడించాడు. తన శరీరం ఇంకా పూర్తి ఫిట్‌గా ఉందని, పుదుచ్చేరి తరఫున అలాగే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా రాణించడమే లక్ష్యమని చెప్పాడు. ముఖ్యంగా టీ20ల్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
కాగా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడే శశాంక్ 2025లో అద్భుతంగా రాణించాడు. 153.51 స్ట్రైక్‌రేట్‌తో 350 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 2026 సీజన్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక, తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 132 పరుగులు మాత్రమే నమోదు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి