Reading Time: < 1 minute
సడెన్‌గా మీ నోట్లోకి ఈగ, దోమలాంటిది దూరిందా..? టెన్షన్‌ పడకుండా ఇలా చేయండి! డాక్టర్ల సూచనలు ఇవే..

బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడేటప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా నోట్లోకి ఈగ లేదా దోమ వెళ్లడం సర్వసాధారణం. ఇలా జరిగినప్పుడు చాలామంది భయాందోళనకు గురవుతుంటారు. అయితే, ఈ పరిస్థితిలో కంగారుపడకుండా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కంగారులో వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల ఆ కీటకం ఊపిరితిత్తులు లేదా శ్వాసనాళంలోకి వెళ్లి ఊపిరి ఆడకపోవడానికి దారితీస్తుంది. నోట్లోకి ఈగ లేదా దోమ వెళ్లిన వెంటనే ఏం చేయాలో డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

భయపడకండి, ప్రశాంతంగా ఉండండి:

నోట్లోకి కీటకం వెళ్లగానే చాలామంది కంగారుతో వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. వేగంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల ఆ కీటకం శ్వాసనాళంలోకి వెళ్లి ఊపిరితిత్తులలో అడ్డుపడే ప్రమాదం ఉంది. ఇది శ్వాస ఆడకపోవడం లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే ముందుగా ప్రశాంతంగా ఉండాలి.

వెంటనే బయటకు ఉమ్మేయండి:

కీటకం నోటి ముందరి భాగంలోనే ఉంటే, దాన్ని తక్షణమే బయటకు ఉమ్మేయడానికి ప్రయత్నించండి. వేళ్లతో తీసే క్రమంలో అది గొంతులోకి జారకుండా చూసుకోవాలి.

గట్టిగా దగ్గండి:

ఒకవేళ ఆ కీటకం గొంతు వెనుక భాగానికి చేరినట్లు అనిపిస్తే, గట్టిగా దగ్గడానికి ప్రయత్నించండి. ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలి ఒత్తిడి వల్ల కీటకం సహజంగానే బయటకు వచ్చేస్తుంది.

గోరువెచ్చని నీటితో పుక్కిలించండి:

నోట్లో లేదా గొంతులో ఈగ అతుక్కుపోయినట్లు అనిపిస్తే వెంటనే గోరువెచ్చని నీటిని నోట్లో పోసుకుని గార్గ్లింగ్ చేయాలి. నీటి ప్రవాహానికి అది ఊడి బయటకు వచ్చేస్తుంది.

పొట్టలోకి వెళ్తే ప్రమాదమా?:

జీర్ణవ్యవస్థలోకి వెళ్లిన సాధారణ ఈగలు లేదా దోమలను మన కడుపులోని యాసిడ్లు అరిగించేస్తాయి. అయినప్పటికీ, ఈగల కాళ్లపై హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉన్నందున, పొట్టలో వికారం లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?:

తేనెటీగ లేదా దంబరి వంటి కుట్టే కీటకాలు నోట్లోకి వెళ్లినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, లేదా గొంతులో తీవ్రమైన వాపు, నొప్పి వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..