
కడప, జులై 3: నేటి కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఏళ్ల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. లెక్కకు మించి పుస్తకాలతో కుస్తీ పట్టాలి. ఒక్క పోస్టు కోసం లక్షలాది మంది పోటీ పడుతున్న ఈ రోజుల్లో.. కడపకు చెందిన ఓ కుర్రాడు అలవోకగా ఏకంగా 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టాడు. లొమడ నాగేంద్ర సాయి గురించే మనం చర్చిస్తుంది. గతంలో ఐటీ ఉద్యోగం చేసిన ఈ యువకుడు లేఆఫ్స్ కారణంగా విసుగుచెంది ప్రభుత్వ ఉద్యోగాల వేటలోకి దిగాడు. ఒకే ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అరుదైన రికార్డు సాధించాడు. పట్టుదల, సరైన ప్రణాళిక, నిరంతర శ్రమ ఉంటే అసాధ్యం ఏదీ లేదని తన విజయంతో నిరూపించాడు.
సాఫ్ట్‌వేర్ కల నుంచి ప్రభుత్వ ఉద్యోగం వరకు
కడప పట్టణానికి చెందిన నాగేంద్ర సాయి తండ్రి అశ్వనీకుమార్ ఏపీఎస్‌ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి, తల్లి రాజరాజేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పదో తరగతిలో 9.7 జీపీఏ, ఇంటర్‌లో 974 మార్కులు సాధించిన అశ్వనీ కుమార్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకుతో ఐఐటీ ఖరగ్‌పూర్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎంటెక్ కోర్సులో చేరాడు. చదువు పూర్తయ్యాక మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగాడు. అయితే 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు, లేఆఫ్స్ పెరగడంతో ప్రైవేట్ ఉద్యోగాల్లో భద్రత లేదని గుర్తించాడు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల వైపు దృష్టి మళ్లించాడు.
తొలి ప్రయత్నంలో ఎదురుదెబ్బ
2022 నుంచి ఇంటి వద్దే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. 2023లో ఐదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసినా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. దీంతో తన సన్నద్ధతలో లోపాలున్నాయని గ్రహించి, 2024లో హైదరాబాద్‌కు వెళ్లి ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకున్నాడు. అనంతరం అక్కడే ఉంటూ మరింత కష్టపడి చదివాడు. ఈ సమయంలో ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలో మంచి మార్కులు వచ్చినప్పటికీ, నార్మలైజేషన్ ప్రక్రియ కారణంగా ఉద్యోగం త్రుటిలో చేజారింది. అయినా నిరాశ చెందకుండా తన లోపాలను సరిదిద్దుకుని మళ్లీ లక్ష్యంపై దృష్టి పెట్టాడు.
ఒకే ఏడాదిలోనే 13 ఉద్యోగాలు
2025లో విడుదలైన దాదాపు అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేశాడు. రోజుకు 12 నుంచి 14 గంటలు క్రమశిక్షణతో చదువుతూ, ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు సెల్ఫ్ మోటివేషన్ వీడియోలు, పాజిటివ్ కంటెంట్ చూస్తూ తనను తాను ప్రోత్సహించుకునేవాడు. ఆ కఠిన శ్రమ ఫలించి, ఒకే ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపిక అయ్యాడు. వాటిలో తనకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకుని ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ (SSO)గా విధులు నిర్వహిస్తున్నాడు. నాగేంద్ర సాయి విజయగాథ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మొదటి ప్రయత్నాల్లో అపజయాలు ఎదురైనా నిరాశ చెందకుండా, లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటూ క్రమశిక్షణతో శ్రమిస్తే విజయం తప్పకుండా సాధ్యమవుతుందని ఆయన నిరూపించాడు. సరైన ప్రణాళిక, పట్టుదల, నిరంతర సాధన ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆయన ప్రయాణం చెబుతోంది.