Reading Time: < 1 minute

AV Ranganath : హైదరాబాద్ ప్రజా సమస్యలు, చెరువుల పరిరక్షణ ధ్యేయంగా వార్తల్లో నిలుస్తున్న హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ వారం రోజుల వ్యక్తిగత సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరారు. కేరళ పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన, సోమవారం నిర్వహించిన ‘హైడ్రా ప్రజావాణి’ కార్యక్రమానికి హాజరై బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన తర్వాత ఆయన మొదటిసారిగా విధుల్లోకి రావడం విశేషం.

 

రంగనాథ్‌ను కమిషనర్ పదవి నుంచి తొలగించాలని, అలాగే ఆయనపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పు వెలువడినప్పటికీ ప్రభుత్వం ఇంకా దానిపై ఉన్నత స్థాయిలో అప్పీల్‌కు వెళ్లకపోవడం, ఈ క్రమంలోనే రంగనాథ్ తిరిగి విధుల్లో చేరి ప్రజావాణిలో పాల్గొనడం సచివాలయం, పోలీసు ఉన్నతాధికారుల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైడ్రా భవిష్యత్తు , కమిషనర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.