Reading Time: 4 minutes
Prashant Kishor Bankipur Bypoll Win Bjp Fortress Key Factors

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ఘన విజయాన్ని అందుకున్నారు. బీహార్‌లోని బంకీపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని అందుకున్నారు. 30 ఏళ్ల కాషాయ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టారు. బీజేపీ అభ్యర్థి నీరజ్‌ సిన్హాపై 20 వేల మెజార్టీతో భారీ విక్టరీ అందుకున్నారు.

1995 నుంచి బంకీపూర్ నియోజకవర్గంపై బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. అలాంటి కంచుకోటను ప్రశాంత్ కిషోర్ బద్దలు కొట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో బంకీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. బీజేపీకి ఇది ప్రతిష్ఠాత్మక పోరుగా మారగా.. ప్రశాంత్ కిషోర్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షగా నిలిచింది. ప్రచారం సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ఈ ఉప ఎన్నికను సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ‘‘ప్రజాభిప్రాయ సేకరణ’’గా అభివర్ణించారు. ‘‘ఒక్క ఎమ్మెల్యే బంకీపూర్‌ను పూర్తిగా మార్చలేకపోవచ్చు. కానీ మీరు ఎన్నుకునే ఒక్క ఎమ్మెల్యేకు మిగిలిన 242 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండవచ్చు’’ అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

విజయానికి  ప్రధాన కారణాలు ఇవే..

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల్లో 238 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. అయితే సుమారు 3.4 శాతం ఓట్లు సాధించినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పోటీ చేయడం వల్ల పార్టీ ప్రచార, సంస్థాగత వనరులు అనేక ప్రాంతాలకు విభజించాల్సి వచ్చింది.

అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ పూర్తిగా ఒకే నియోజకవర్గంపై దృష్టి సారించే అవకాశం లభించింది. వారాల తరబడి బంకీపూర్‌లో విస్తృతంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహించారు. మొహల్లా సమావేశాలు, అడ్డా బైఠక్‌లు, చాయ్ బైఠక్‌లు, పాదయాత్రలు, జన సంవాద్ కార్యక్రమాలు నిర్వహించారు. మేధావులు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతూ నియోజకవర్గంలోని దాదాపు ప్రతి వీధిని సందర్శించారు. తన అభ్యర్థిత్వం ప్రకటించిన రోజు నుంచే ఈ ఎన్నిక కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునే పోటీ కాదని.. బీహార్‌లో ప్రత్యామ్నాయ రాజకీయాలకు సంబంధించిన పోరాటమని జన్ సురాజ్ ప్రచారం చేసింది. ‘‘ఇది ఒక్క ఎమ్మెల్యే గురించి కాదు.. ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి’’ అంటూ పార్టీ నాయకులు ప్రచారం చేశారు.

ఈ ఎన్నిక వల్ల ప్రభుత్వం మారకపోయినా.. బీహార్ రాజకీయాల దిశ మారవచ్చని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. స్థానిక ఉప ఎన్నికను పాలన, జవాబుదారీతనం, రాజకీయ మార్పు వంటి అంశాలతో ముడిపెట్టి రాష్ట్రవ్యాప్త రాజకీయ చర్చగా మార్చడంలో జన్ సురాజ్ విజయం సాధించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ అభ్యర్థి మార్పుతో ప్రచారానికి ఆటంకం

బంకీపూర్ బీజేపీకి అత్యంత సురక్షితమైన పట్టణ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ స్థానాన్ని సులభంగా నిలబెట్టుకుంటామని భావించిన బీజేపీకి ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. బీజేపీ తొలుత అభిషేక్ కుమార్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. తొలుత వ్యక్తిగత కారణాలను, అనంతరం కుటుంబ కారణాలను ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అయితే అభ్యర్థిపై పార్టీకి ప్రతికూల సమాచారం అందడంతోనే ఆయనను మార్చినట్లు కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అభిషేక్ కుమార్ సిన్హా తండ్రి రవీంద్ర ప్రసాద్.. దాణా కుంభకోణం కేసులో మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు దోషిగా తేలినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను ప్రశాంత్ కిషోర్ సేకరించారని, ఎన్నికల ప్రచారంలో దీనిని ప్రధాన అంశంగా మార్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావించినట్లు కొన్ని కథనాలు వెల్లడించాయి. దీంతో బీజేపీ అభిషేక్ స్థానంలో 32 ఏళ్ల నీరజ్ కుమార్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించింది.

అభ్యర్థి మార్పుతో వివాదం మరింత పెరగకుండా బీజేపీ అడ్డుకోగలిగినప్పటికీ.. కొత్త అభ్యర్థితో ప్రచారాన్ని దాదాపు మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటివరకు సాధారణ ఉప ఎన్నికగా భావించిన పోటీ ఒక్కసారిగా బీజేపీకి సవాలుగా మారింది. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి బీజేపీ భయపడుతోందని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. అభ్యర్థి మార్పు ద్వారా పార్టీ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిందని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి.

నితీశ్ కుమార్ ప్రభావం లేకపోవడం

నితీశ్ కుమార్ క్రియాశీల రాజకీయాలకు దూరమైన తర్వాత బీహార్‌లో జరిగిన తొలి కీలక ఎన్నికగా బంకీపూర్ ఉప ఎన్నికను భావించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే.. నితీశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు పెట్టి ఎన్నికలకు వెళ్లింది. అయితే నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లిన తర్వాత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. దీంతో బీజేపీ కొత్త నాయకత్వ వ్యవస్థలో జరిగిన తొలి ఎన్నికగా బంకీపూర్ ఉప ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మార్పును జన్ సురాజ్ ప్రధాన ప్రచార అంశంగా మార్చింది. ప్రజలు నితీశ్ కుమార్ ముఖాన్ని చూసి ఎన్డీయేకు ఓటు వేశారని.. సామ్రాట్ చౌదరి ప్రజలు నేరుగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.

సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఈ ఉప ఎన్నికను ప్రజాభిప్రాయ సేకరణగా అభివర్ణించారు. బంకీపూర్‌లో బీజేపీ ఓడిపోతే.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రజలు ఆమోదించడం లేదనే స్పష్టమైన సంకేతం వెళ్తుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ తన అగ్ర నాయకత్వాన్ని రంగంలోకి దించింది. రాజ్యసభకు వెళ్లినప్పటికీ నితిన్ నబిన్ స్వయంగా ప్రచారాన్ని నడిపించారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఎంపీ రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం చివరి దశలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నితీశ్ కుమార్ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. అయితే ఆ వీడియో కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించిందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. నితీశ్ కుమార్ ఎన్నికల ముఖచిత్రంగా లేకపోవడం ఓటర్లపై ఎంత ప్రభావం చూపిందో స్పష్టంగా కొలవలేకపోయినా.. ఎన్నికల ప్రచారంలో ఇది ప్రధాన అంశంగా నిలిచింది.

ప్రతిపక్ష సామాజిక ఓటు సమీకరణల ప్రభావం

బంకీపూర్‌లో మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ.. ఎన్నికల ప్రచారం క్రమంగా బీజేపీ వర్సెస్ ప్రశాంత్ కిషోర్ పోరుగా మారింది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా దాదాపు 47 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆర్జేడీ ప్రచారం చివరి రోజుల వరకు పెద్దగా కనిపించలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. చివరి దశలో తేజస్వీ యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగితే.. నియోజకవర్గంలోని సామాజిక, రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని ఎన్నికలకు ముందే విశ్లేషకులు అంచనా వేశారు.

కొంతమంది ముస్లిం ఓటర్లు ప్రశాంత్ కిషోర్‌ను ప్రత్యామ్నాయంగా చూడటం ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. బంకీపూర్‌లో ఆర్జేడీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే స్థితిలో లేదనే భావన ఏర్పడడంతో.. బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయాలనే ఉద్దేశంతో జన్ సురాజ్‌కు మద్దతు పెరిగి ఉండవచ్చని విశ్లేషించారు. జన్ సురాజ్ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగిన తర్వాత.. యాదవ్ వర్గానికి చెందిన కొంతమంది ఓటర్లు కూడా ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

ముస్లింలు, యాదవులు, మహిళలు, ఇతర చిన్న సామాజిక వర్గాల ఓట్లను ప్రశాంత్ కిషోర్ ఏకీకృతం చేయగలిగితే.. బీజేపీకి ఇబ్బందులు తప్పవని అంచనా వేశారు. ఆర్జేడీ ఓటు శాతం గణనీయంగా తగ్గడం, జన్ సురాజ్ ఓటు శాతం భారీగా పెరగడం.. ఆర్జేడీకి సంప్రదాయంగా మద్దతుగా ఉన్న ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకులో కొంత భాగం ప్రశాంత్ కిషోర్ వైపు మళ్లి ఉండవచ్చనే సంకేతాలను ఇస్తోంది.

నీట్ విద్యార్థుల ఆందోళనలు, భరత్ తివారీ ఎన్‌కౌంటర్ ప్రభావం

ప్రారంభంలో సాధారణ ఉప ఎన్నికగా భావించిన బంకీపూర్ పోటీ.. ప్రచారం చివరి దశకు చేరుకునే సరికి స్థానిక అభివృద్ధి అంశాలకు మించి ఇతర రాజకీయ, సామాజిక అంశాల చుట్టూ తిరిగింది. నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల ఆందోళనలు, పాట్నాలో నిరసనకారులపై పోలీసులు తీసుకున్న చర్యలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలుగా మారాయి.

బంకీపూర్ నియోజకవర్గంలో పాట్నా యూనివర్సిటీతో పాటు అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సంస్థలు ఉన్నాయి. దీంతో విద్య, ఉపాధి, విద్యార్థుల సమస్యలు ఎన్నికల ప్రచారంలో అసాధారణ ప్రాధాన్యత పొందాయి. బీహార్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని చాలా కాలంగా ప్రచారం చేస్తున్న ప్రశాంత్ కిషోర్.. విద్యార్థుల్లో ఉన్న అసంతృప్తిని ఉప ఎన్నికతో ముడిపెట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థుల నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలకు ఉపయోగించారు.

అదేవిధంగా భరత్ తివారీ పోలీస్ ఎన్‌కౌంటర్ అంశం కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావనకు వచ్చింది. స్థానిక అభివృద్ధి అంశాలతో పాటు విద్యార్థుల ఆందోళనలు, ఉపాధి, పోలీసు చర్యలు, సామాజిక సమీకరణాలు ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపిన అంశాలుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మొత్తంగా బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ కేవలం బీజేపీ అభ్యర్థిపై ఆధిక్యం సాధించడం మాత్రమే కాకుండా.. బీహార్ రాజకీయాల్లో జన్ సురాజ్‌ను బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నంలో కీలక ముందడుగు వేశారు. బీజేపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఆయన సాధించిన ఈ విజయం.. రానున్న రోజుల్లో బీహార్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.