
అర్ధరాత్రి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి డమ్మీ తుపాకీతో కుటుంబ సభ్యులను బెదిరించిన ఘటన బోడుప్పల్ లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సోమవారం (ఆగస్టు 03) మేడిపల్లి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక డమ్మీ గన్ తో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బోడుప్పల్ సప్తగిరిహిల్స్ కు చెందిన చిత్తరంజన్ బిశ్వాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి భార్య ఇంద్రాణి బిశ్వాస్ నిర్వహిస్తున్న క్లౌడ్ కిచెన్ వ్యాపారం ద్వారా ఏడాది క్రితం అనిల్ కుమార్, అతని భార్య సుమన్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం అనిల్ కుమార్ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఇంద్రాణితో సన్నిహితంగా ఉంటూ తరచూ వారి ఇంటికి వెళ్లేవాడని, దీంతో చిత్తరంజన్ బిశ్వాస్, ఇంద్రాణి బిశ్వాస్, దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి 12:25 గంటలకు అనిల్ కుమార్ ఫిర్యాదు దారుడికి ఫోన్ చేసి అతని భార్య గురించి ప్రశ్నిస్తూ అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం చిత్తరంజన్ బిశ్వాస్ ఇంటికి రాత్రి 1 గంట ప్రాంతంలో అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించి, రెండో అంతస్తులోని ఇంటి తలుపును బలవంతంగా తెరిచాడని తెలిపారు.
తన వద్ద ఉన్న డమ్మీ తుపాకిని చూపిస్తూ చంపేస్తానని బెదిరించి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత అనిల్ కుమార్ భార్య సుమన్ కూడా ఇంట్లోకి ప్రవేశించి ఫిర్యాదుదారుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మేడిపల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనలో ఉపయోగించిన బొమ్మ తుపాకి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ ను రిమాండ్ కి తరలించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.