
సాధారణంగా అడవి రాజు సింహం అని అంటారు. కానీ, ఈ సింహం కేవలం రాజు కాదు.. చక్రవర్తి. తిరుగులేని తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన భయంకరమైన మృగరాజు. దాని పేరు స్కార్‌ఫేస్. ఆఫ్రికాలోని కెన్యా అడవుల్లో ఒకప్పుడు గంభీరంగా సంచరించింది. అది వస్తుంటే.. ఏ జంతువైనా సాగిల పడాల్సిందే. తన తోటి సింహాలకు కూడా అదంటే వణుకు. అందుకే స్కార్‌ఫేస్ సింహం ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణి ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. దాని ధైర్యం, నాయకత్వ లక్షణాలు, వేట నైపుణ్యం, సుదీర్ఘ జీవితకాలం కారణంగా ఈ సింహం సాధారణ అడవి జంతువుగా కాకుండా ఒక లెజెండ్‌గా గుర్తింపు పొందింది.
స్కార్‌ఫేస్ పేరు ఎలా వచ్చింది?
ఈ సింహం కుడి కన్ను మీదుగా ముఖం వరకు పెద్ద గాయం మచ్చ ఉండేది. ప్రత్యర్థి సింహంతో జరిగిన పోరాటంలో ఆ గాయం ఏర్పడిందని వన్యప్రాణి నిపుణులు భావిస్తున్నారు. ఆ శాశ్వత మచ్చ కారణంగానే దీనికి స్కార్‌ఫేస్ అనే పేరు వచ్చింది. ఆ గాయం ఉన్నప్పటికీ దాని ఆత్మవిశ్వాసం, ఆధిపత్యం ఏమాత్రం తగ్గలేదు.
కంటి గాయం వెనుక భీకర పోరాటం
మసాయ్ మారా అడవిలో ప్రతి మగ సింహం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి తరచూ ఇతర మగ సింహాలతో పోరాడుతుంది. స్కార్‌ఫేస్ కూడా తన పరిధి, ఆడ సింహాల గుంపును రక్షించేందుకు ఎన్నోసార్లు ప్రత్యర్థులను ఎదుర్కొంది. ఒకసారి జరిగిన తీవ్ర పోరాటంలో ప్రత్యర్థి సింహం తన పదునైన గోళ్లతో లేదా కోరలతో స్కార్‌ఫేస్ ముఖంపై బలంగా దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఆ దాడిలో కుడి కంటిపై లోతైన గాయం ఏర్పడి, కన్ను పైనుంచి చెంప వరకు పెద్ద మచ్చ మిగిలిపోయింది. ఆ శాశ్వత మచ్చ కారణంగానే దానికి స్కార్‌ఫేస్ అనే పేరు వచ్చింది.
ఇది కూడా చదవండి: పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా?
గాయం తర్వాత కూడా తగ్గేదే లే..
సాధారణంగా ఇలాంటి గాయాల తర్వాత చాలా మగ సింహాలు తమ ఆధిపత్యాన్ని కోల్పోతాయి. కానీ స్కార్‌ఫేస్ మాత్రం ఆ గాయం నుంచి కోలుకుని మళ్లీ తన గుంపుకు నాయకత్వం వహించింది. గాయం ఉన్నప్పటికీ వేటలో పాల్గొనడం, ప్రత్యర్థులను ఎదుర్కోవడం, తన పరిధిని కాపాడుకోవడం కొనసాగించింది. కంటిపై తీవ్రమైన గాయం, ముఖంపై శాశ్వత మచ్చ ఉన్నప్పటికీ స్కార్‌ఫేస్ చాలా సంవత్సరాలు మసాయ్ మారా అడవిలో ఆధిపత్యాన్ని కొనసాగించింది. అందుకే వన్యప్రాణి ప్రేమికులు దానిని కేవలం ఒక సింహంగా కాకుండా ధైర్యానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా గుర్తుంచుకుంటారు.
మసాయ్ మారా అడవికి రాజు కాదు.. మహారాజు!
స్కార్‌ఫేస్ కెన్యాలోని ప్రసిద్ధ మసాయ్ మారా నేషనల్ రిజర్వ్ ప్రాంతంలో జీవించింది. అక్కడ నాలుగు సింహాల సమూహంలో ఇది ప్రముఖ సభ్యుడిగా ఉండేది. ఈ సమూహాన్ని ఫోర్ మస్కెటియర్స్ అని కూడా పిలిచేవారు. ప్రత్యర్థి సింహాలను ఎదుర్కొని తమ పరిధిని కాపాడుకోవడంలో స్కార్‌ఫేస్ కీలక పాత్ర పోషించింది. స్కార్‌ఫేస్ తన బలం మాత్రమే కాకుండా తెలివితేటలతో కూడా వేటాడేది. జీబ్రాలు, అడవి దున్నలు, జిరాఫీల వంటి పెద్ద జంతువులను వేటాడే సమయంలో ఇతర సింహాలతో సమన్వయంగా వ్యవహరించేది. అనుభవంతో కూడిన దాని వేట విధానం వన్యప్రాణి పరిశోధకులను కూడా ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి: కూరకు పనికిరాని కొర్రమీను.. మన చెరువుల్లో దొరికే ఈ చేపను ఎందుకు తినరు?
సుదీర్ఘ జీవితం
అడవిలో నివసించే మగ సింహాల సగటు జీవితకాలం సాధారణంగా 10 నుంచి 14 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అయితే స్కార్‌ఫేస్ దాదాపు 14 సంవత్సరాలకు పైగా జీవించి అరుదైన రికార్డు సృష్టించింది. అనేక పోరాటాలు, గాయాలు ఎదుర్కొన్నప్పటికీ ఎక్కువ కాలం జీవించడం దాని ప్రత్యేకతగా నిలిచింది. 2021లో స్కార్‌ఫేస్ వృద్ధాప్యంతో సహజ మరణం చెందింది. దాని మరణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వన్యప్రాణి అభిమానులు సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు.
స్కార్‌ఫేస్ కథ కేవలం ఒక సింహం జీవితగాథ మాత్రమే కాదు. అడవుల్లో జీవవైవిధ్యాన్ని, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రపంచానికి గుర్తు చేసిన ఒక ప్రతీక. నేటికీ మసాయ్ మారా గురించి మాట్లాడినప్పుడు స్కార్‌ఫేస్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. అడవికి నిజమైన రాజుగా, ధైర్యానికి నిదర్శనంగా, ప్రకృతి వైభవానికి చిహ్నంగా స్కార్‌ఫేస్ సింహం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.