Reading Time: < 1 minute

రూ.10 కోట్ల వడ్ల పైసలు ఎగ్గొట్టిన వ్యాపారి.. ఇంట్లోని వస్తువులు బయటేసి నిప్పు పెట్టిన రైతులు

Caption of Image.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణానికి చెందిన శ్రీధర్​అనే వ్యాపారి ఇంటి ముందు రైతులు ఆందోళనకు దిగారు. ఏడాది గడిచినా తమ వడ్ల పైసలు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన దండేపల్లి మండలానికి చెందిన సుమారు 100 మంది రైతులు సోమవారం వ్యాపారి ఇంటికి వచ్చి.. తాళాలు పగలగొట్టి లోపల ఉన్న సామాన్లు బయట వేసి నిప్పు పెట్టారు. 

ఇంటిపైన ‘ఈ ప్రాపర్టీ దండేపల్లి రైతులకు చెందినది’అని రాశారు. ధాన్యం అమ్మి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, వెంటనే తమ డబ్బులు చెల్లించాలని నినాదాలు చేశారు. లక్సెట్టిపేటకు చెందిన శ్రీధర్​ గత 20 ఏండ్లుగా ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు. చాలాకాలంగా వ్యాపారం చేస్తున్న శ్రీధర్​పై నమ్మకంతో రైతులు ముందుగా ధాన్యం ఇచ్చి తర్వాత డబ్బులు తీసుకునేవారు. 

ఈ క్రమంలో గత ఏడాది దండేపల్లి మండలానికి చెందిన రైతుల వద్ద నుంచి సుమారు రూ.10 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసిన శ్రీధర్​ వారికి డబ్బులు చెల్లించకుండా ఊరు వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన రైతులు గత ఏడాదే ఆందోళనకు దిగారు. తాను వ్యాపారంలో నష్టపోయానని, తన భూములు అమ్మి రైతులకు డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో రైతులు ఏడాదికాలంగా డబ్బుల కోసం వేచి చూస్తున్నారు. 

ఇప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో సోమవారం ఆందోళనకుదిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని నమ్మకంతో వ్యాపారికి అప్పజెప్పితే డబ్బులు ఇవ్వడంలేదని, తమను నిలువునా ముంచాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ డబ్బులు ఇప్పించాలని వారు కోరారు. 

అనంతరం ఆ వ్యాపారి ఇంటి నుంచి గాంధీ చౌక్ వరకు ముఖానికి నల్ల గుడ్డలు కట్టుకొని ర్యాలీగా వెళ్లారు. గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ తమ డబ్బులు చెల్లించాలని రైతులు నినాదాలు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.