
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పరస్పర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, ఇంధన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇరాన్ తన వ్యూహాన్ని మార్చినట్లుగా కనిపిస్తోంది. చమురు, క్షిపణులు కాకుండా డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
అమెరికా, దాని మిత్రదేశాలపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఏఐ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంటోందని సీఎన్‌ఎన్ నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు డేటా సెంటర్లు ప్రధానంగా సైబర్ దాడుల ముప్పును ఎదుర్కొనేవి. అయితే ఇప్పుడు క్షిపణులు, డ్రోన్లతో నేరుగా దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏఐ డేటా సెంటర్లు ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ సేవలు, కీలక సమాచార వ్యవస్థలు, సైనిక కమ్యూనికేషన్లకు కూడా మద్దతు ఇస్తున్నాయి. దీంతో ఈ కేంద్రాలు కేవలం సాంకేతిక మౌలిక సదుపాయాలుగా కాకుండా.. సైనిక వ్యూహం, జాతీయ భద్రత, ప్రపంచ ఆర్థిక పోటీతో ముడిపడిన కీలక ఆస్తులుగా మారాయి.
ఏఐ డేటా సెంటర్లే ఎందుకు లక్ష్యం?
సైనిక శక్తిలో తమకంటే బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు.. వారికి ఆర్థికంగా కీలకమైన ఆస్తులపై దాడులు చేయడం ఇరాన్ యుద్ధ వ్యూహంలో భాగంగా ఉందని సీఎన్‌ఎన్ పేర్కొంది. యుద్ధం ప్రారంభ దశలో గల్ఫ్ ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, చమురు ఎగుమతి మౌలిక సదుపాయాలు, పర్యాటక కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇటీవల ఈ వ్యూహాన్ని ఏఐ డేటా సెంటర్లకు కూడా విస్తరించినట్లు సమాచారం. క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ సేవలు, సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థలకు మద్దతు ఇచ్చే డేటా సెంటర్లపై ఇరాన్ దాడులు చేపట్టిందని పేర్కొంది. ఈ ఘర్షణల సమయంలో ఇరాన్, అమెరికా రెండు దేశాలు కూడా డేటా సెంటర్లపై దాడులు చేసినట్లు సీఎన్‌ఎన్ నివేదించింది. గల్ఫ్ ప్రాంతంలోని పలు కేంద్రాలపై ఇరాన్ దాడులు చేయగా.. అమెరికా కూడా ఇరాన్‌లోని ఒక డేటా సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
గల్ఫ్ ప్రాంతంలో జరిగిన అత్యంత కీలక దాడుల్లో ఒకటి బహ్రెయిన్‌లో చోటుచేసుకున్నట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది. గత నెల చివరిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) డేటా సెంటర్‌పై ఇరాన్ రెండోసారి క్షిపణి దాడి చేసినట్లు నివేదించింది. ఈ ఘటనపై అమెజాన్ స్పందించేందుకు నిరాకరించింది. అయితే ఏప్రిల్ 30న జరిగిన తొలి దాడి తర్వాత నుంచి ఈ ప్రాంతంలో ఏడబ్ల్యూఎస్ సేవలకు అంతరాయాలు కొనసాగుతున్నట్లు సంస్థ సర్వీస్ డ్యాష్‌బోర్డ్‌లో కనిపించిందని సీఎన్‌ఎన్ తెలిపింది. ఉపగ్రహ చిత్రాల్లో కూడా ఆ డేటా సెంటర్‌కు భారీ నష్టం జరిగినట్లు గుర్తించినట్లు పేర్కొంది.
ఇలాంటి సాంకేతిక కేంద్రాలు చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) బహిరంగంగా ప్రకటించింది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, పలాంటీర్ సంస్థలకు సంబంధం ఉన్న కేంద్రాలతో సహా ప్రాంతంలోని 29 సాంకేతిక లక్ష్యాల జాబితాను ఐఆర్‌జీసీ విడుదల చేసినట్లు సీఎన్‌ఎన్ తెలిపింది. జూలై 21న జరిగిన దాడి అనంతరం.. అమెరికా సైనిక నిఘా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఏడబ్ల్యూఎస్ అందిస్తున్నందునే అమెజాన్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారులు ప్రకటించారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన 9 బిలియన్ డాలర్ల ‘జాయింట్ వార్‌ఫైటింగ్ క్లౌడ్ క్యాపబిలిటీ’ కార్యక్రమంలో అమెజాన్‌తో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.
పెరుగుతున్న ముప్పు
ప్రపంచ ఏఐ రంగంలో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలను విభిన్న రంగాల్లో విస్తరించేందుకు గల్ఫ్ దేశాలు కృత్రిమ మేధ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సౌదీ అరేబియా తన 1 ట్రిలియన్ డాలర్ల సార్వభౌమ సంపద నిధిలో గణనీయమైన భాగాన్ని ఏఐ ప్రాజెక్టులకు కేటాయించినట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ట్రంప్ ప్రభుత్వంతో కలిసి 500 బిలియన్ డాలర్ల ‘స్టార్‌గేట్ ఏఐ డేటా సెంటర్’ ప్రాజెక్టులో భాగస్వామ్యమైంది. ఈ ప్రాజెక్టులో ఓపెన్‌ఏఐ, ఒరాకిల్, ఎన్విడియా, సిస్కో వంటి సంస్థలు పాల్గొంటున్నాయి.
బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు కలిసి అమెరికాతో ఏఐ సంబంధిత పెట్టుబడుల కోసం 2 ట్రిలియన్ డాలర్లకు పైగా కేటాయించేందుకు అంగీకరించాయి. ఇదే సమయంలో చైనాకు చెందిన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కూడా ఈ దేశాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతానికి కొత్త ముప్పును తెచ్చిపెట్టాయని ఆర్‌బీసీ క్యాపిటల్ మార్కెట్స్ గ్లోబల్ స్ట్రాటజీ విభాగాధిపతి హెలిమా క్రాఫ్ట్ పేర్కొన్నారు.
‘‘ఈ దాడులు, ఇతర ముప్పులు ఏఐ ఆవిష్కరణలు, పెట్టుబడులకు కీలక ప్రాంతంగా ఎదుగుతున్న గల్ఫ్‌పై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. యుద్ధం, దౌత్య వ్యవహారాల్లో ఈ సాంకేతిక సంస్థలు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో కూడా ఈ ఘటనలు వెల్లడిస్తున్నాయి. ఈ సంస్థలను రక్షించేందుకు అమెరికా ఎంతవరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందనే అంశాన్ని కూడా ఇవి స్పష్టం చేస్తున్నాయి’’ అని ఆమె సీఎన్‌ఎన్‌తో అన్నారు.
యుద్ధ వ్యూహంలో కీలక మార్పు
యుద్ధ సమయాల్లో ప్రత్యర్థి కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీయడానికి సైనిక బలగాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో ఎలక్ట్రానిక్ యుద్ధం, సిగ్నల్ జామింగ్, సైబర్ దాడుల ద్వారా ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించేవారు. అయితే ఏఐ డేటా సెంటర్లపై నేరుగా క్షిపణులు, డ్రోన్లతో భౌతిక దాడులు చేయడం యుద్ధ వ్యూహంలో కీలక మార్పుగా భావిస్తున్నారు. ఆధునిక డేటా సెంటర్లు ఒకేసారి పౌర వాణిజ్య సేవలకు, సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వగలవని కాలిఫోర్నియా యూనివర్సిటీ, బర్కిలీ ప్రజా విధానాల ప్రొఫెసర్ ఆండ్రూ రెడ్డీ తెలిపారు. ‘‘డేటా సెంటర్లపై ‘ఇక్కడ సైనిక సమాచారం ఉంది’ అనే స్టిక్కర్ ఉండదు. ఒకే డేటా సెంటర్‌లో సైనిక అవసరాలకు ఉపయోగపడే సమాచారం, వాణిజ్య సేవలకు సంబంధించిన డేటా రెండూ ఉండే అవకాశం ఉంది’’ అని ఆయన తెలిపారు. ‘‘మీరు ఇరాన్ స్థానంలో ఉండి అమెజాన్‌ను చూస్తే.. ఆ సంస్థపై అమెరికా జెండా వేసినట్లుగానే భావించవచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
డేటా సెంటర్లకు రక్షణ సాధ్యమేనా?
క్షిపణులు, డ్రోన్ దాడుల నుంచి ఏఐ మౌలిక సదుపాయాలను రక్షించడం పెద్ద సవాలుగా మారిందని సీఎన్‌ఎన్ పేర్కొంది. సైనిక బంకర్ల మాదిరిగా కాకుండా డేటా సెంటర్లు సాధారణంగా పెద్ద గిడ్డంగుల తరహా భవనాల్లో ఏర్పాటు చేస్తారు. వీటిలో అత్యంత ఖరీదైన కంప్యూటింగ్ పరికరాలు ఉంటాయి. విమాన దాడులను తట్టుకునేలా ఇలాంటి కేంద్రాలను భౌతికంగా బలోపేతం చేయడానికి చాలా పరిమిత అవకాశాలే ఉన్నాయని ఎంఎస్‌ఐజీ యూఎస్ ప్రాపర్టీ విభాగాధిపతి ఫిలిప్ రే తెలిపారు. దీంతో డేటా సెంటర్ నిర్వాహకులు ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఒక కేంద్రం పనిచేయకుండా పోయినా సేవలు కొనసాగేందుకు.. డేటాను అనేక ప్రాంతాల్లో నిల్వ చేసే విధానాన్ని అనుసరిస్తున్నారు.
పెట్టుబడులపై ప్రభావం
దాడులు కొనసాగుతున్నప్పటికీ గల్ఫ్ దేశాలు తమ భారీ ఏఐ విస్తరణ ప్రణాళికలను కొనసాగిస్తున్నాయి. అయితే డేటా సెంటర్ల నిర్మాణంలో ఉన్న సంస్థలు ఇప్పుడు అధిక బీమా ప్రీమియాలు, పెరుగుతున్న అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయని సీఎన్‌ఎన్ పేర్కొంది. ఇటీవలి పరిణామాలను పరిశీలించిన కొన్ని సంస్థలు తమ పెట్టుబడి ప్రణాళికలపై పునరాలోచిస్తున్నాయని మార్ష్ ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ సంస్థ యూఎస్ ప్రాపర్టీ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాధిపతి జో మాసెజాక్ తెలిపారు.
‘‘ఇటీవలి ఘటనలను చూసిన కొందరు ఖాతాదారులు తమ పెట్టుబడి ప్రణాళికలను కొనసాగించాలా వద్దా అని మరోసారి ఆలోచిస్తున్నారు. కొన్ని రకాల ముప్పులను స్వీకరించేందుకు కొందరు బీమా సంస్థలు కూడా సౌకర్యంగా లేవు’’ అని ఆయన తెలిపారు.
బీమా సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ.. అన్ని ఆర్థిక నష్టాలను సంస్థలు బీమా కంపెనీలకు బదిలీ చేయలేవని ఆయన పేర్కొన్నారు. డేటా సెంటర్ల నిర్మాణ వ్యయం, సెమీకండక్టర్ల ధరలు, కార్మిక వ్యయాలు, ఏఐ మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న డిమాండ్ ఇప్పటికే భారీగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు క్షిపణులు, డ్రోన్ల ద్వారా జరిగే భౌతిక దాడుల ముప్పు కూడా పెరగడంతో.. గల్ఫ్ ప్రాంతంలో భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఇది మరో కీలక సవాలుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.