Reading Time: < 1 minute
Icc Bans Usa Cricketer Akhilesh Reddy Match Fixing

అమెరికాకు చెందిన 26 ఏళ్ల భారత సంతతి క్రికెటర్ బొడుగుమ్ అఖిలేష్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠిన చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువు కావడంతో అతడిపై ఎనిమిదేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. 2025 అబుదాబి T10 టోర్నమెంట్‌లో ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిని దోషిగా నిర్ధారించారు. ఈ నిషేధం నవంబర్ 21, 2025 నుండి అమల్లోకి వచ్చినట్లు పరిగణించబడుతుంది. అప్పుడే అతడిపై తాత్కాలిక నిలిపివేత వేటు పడింది. ఈ నిషేధం నవంబర్ 2033 వరకు కొనసాగుతుంది. హైదరాబాద్‌లో పెరిగిన అఖిలేష్ రెడ్డి కుడిచేతి వాటం బ్యాటర్, ఆఫ్ స్పిన్ బౌలర్. ఇతడు అమెరికా జాతీయ జట్టు తరఫున 2025లో నాలుగు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

అబుదాబి T10 టోర్నమెంట్ సమయంలో ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ అఖిలేష్ రెడ్డిని మూడు నిబంధనల ఉల్లంఘనకు బాధ్యుడిగా పేర్కొంది. మ్యాచ్‌ ఫలితాన్ని లేదా మ్యాచ్‌లోని ఇతర అంశాలను అక్రమంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఆర్టికల్ 2.1.1ను ఉల్లంఘించాడు. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తన తోటి ఆటగాడిని ప్రోత్సహించడం, ప్రలోభపెట్టడం, ప్రేరేపించడం ద్వారా ఆర్టికల్ 2.1.4ను ఉల్లంఘించినట్లు తేలింది. దీనికి తోడు.. విచారణ ప్రారంభమైన సమయంలో తన మొబైల్ ఫోన్ నుండి చాట్‌లు, కాల్ రికార్డులు , డేటాను డిలీట్ చేసి దర్యాప్తుకు ఆటంకం కలిగించినందుకు ఆర్టికల్ 2.4.7 ప్రకారం దోషిగా తేలాడు.

ఈ ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిషేధంతో అఖిలేష్ రెడ్డి క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్లే భావిస్తున్నారు. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించి చర్యలకు గురైన అమెరికా రెండో అంతర్జాతీయ ఆటగాడిగా ఇతడు నిలిచాడు. అంతకుముందు 2023-24 సీజన్‌లో బార్బడోస్ బీమ్10 టోర్నమెంట్‌లో ఐసీసీ నిబంధనలను ఐదుసార్లు ఉల్లంఘించినందుకు అమెరికా బ్యాటర్ ఆరోన్ జోన్స్‌పై కూడా తాత్కాలిక నిషేధం విధించబడింది. సక్రమమైన పద్ధతిలో క్రీడలను నిర్వహించేందుకు ఐసీసీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.