Reading Time: < 1 minute

మధిర ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ అడ్మిషన్లకు బ్రేక్.. వచ్చే ఏడాదికే తరగతులు!

Caption of Image.
  • వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు చేసే అవకాశం
  • కౌన్సెలింగ్ పూర్తవడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లా మధిరలో కొత్తగా మంజూరైన ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు జరిగే అవకాశం కనిపించడం లేదు. దాదాపు 20 రోజుల కింద  ప్రభుత్వం కాలేజీకి అనుమతి ఇచ్చినా, కొన్ని సాంకేతిక కారణాలతో తరగతుల ప్రారంభం వచ్చే విద్యా సంవత్సరానికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టీజీ ఈఏపీసెట్ మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యింది. 

ఇప్పుడు అడ్మిషన్లు చేపట్టినా సీట్లు పూర్తిగా నిండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. మధిర కాలేజీలో ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువగా కోరుతున్న కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌‌ఈ), సీఎస్‌‌ఈ-డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్) కోర్సులు ప్రారంభించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. 

ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉన్నా, కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఇప్పుడు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చినా విద్యార్థులు ఎంతమంది చేరుతారో స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం తొందరపడడం లేదు. దీంతో 2027-–28 విద్యా సంవత్సరం నుంచే మధిర ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో పూర్తిస్థాయిలో అడ్మిషన్లు ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.