Reading Time: 2 minutes

వెరైటీ బ్రేక్ ఫాస్ట్: సూపర్ టేస్ట్.. హెల్దీఫుడ్.. ఎగ్ ఇడ్లీ.. సమోసా.. పదే పది నిమిషాల్లో తయారీ

Caption of Image.

ఎప్పుడూ అవే బోరింగ్​ కూరలు.. తినితిని బోర్​ కొడుతుందా… అయితే ఈ వర్షాకాలంలో  కాస్త వెరైటీగా  పది నిమిషాల్లో   వండుకుని  వేడి వేడిగా తినాలంటే … అందరికీ అందుబాటులో ఉండే గుడ్డుతో నోరూరించే ఎగ్​ ఇడ్లీలు, సమోసా, ఎగ్​ పచ్చడిఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.  .

ఎగ్​ ఇడ్లీ తయారీకి కావలసినవి

  • గుడ్లు- ఎనిమిది
  • కారం– రెండు టీ స్పూన్లు
  • ధనియాల పొడి- రెండు టీ స్పూన్లు
  • గరంమసాలా- రెండు టీ స్పూన్లు
  • పసుపు-చిటికెడు
  • ఉప్పు- తగినంత
  • నూనె–రెండు టేబుల్ స్పూన్లు 
  • కొత్తిమీర తరుము- కొద్దిగా

ఎగ్​ ఇడ్లీ తయారీ విధానం

ఇడ్లీ ప్లేటుకు కొద్దినా నూనె రాసి ఒక్కో గుంతలో ఒక్కో గుడ్డు పగలగొట్టి వేయాలి. ఇడ్లీ కుక్కర్లో గ్లాసు నీళ్లు పోసి పైన ప్లేటు పెట్టి పదినిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడిచేసి కారం, ధనియాల పొడి, గరంమసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా వేగించాలి. తరువాత ఉడికిన గుడ్డు ఇడ్లీలను ఈ మసాలాలో వేసి విరిగిపోకుండా జాగ్రత్తగా రెండు వైపులా కాల్చాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్​ చేసుకోవాలి. 

ఎగ్​ సమోసా తయారీకి కావలసినవి

  • మైదాపిండి-రెండు కప్పులు
  • నూనె- వేగించడానికి సరిపడా
  • నీళ్లు – పావు కప్పు
  •  ఉడికించిన గుడ్లు- నాలుగు
  •  మిరియాల పొడి – ఒక టీ స్పూన్
  • గోధుమపిండి – ఒక కప్పు
  • ఉప్పు- రుచికి సరిపడ

ఎగ్​ సమోసా తయారీ విధానం

ఉడికించిన గుడ్లను చిన్న ముక్కలుగా కోయాలి. వాటిని మళ్లీ చాకుతోనే సన్నగా తురమాలి. ఇప్పుడు అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి పక్కనుంచాలి. వెడల్పాటి గిన్నెలో మైదాపిండి, గోధమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పిండి ముద్ద చేసి సుమారు అరగంటసేపు తడి బట్ట కప్పి ఉంచాలి.

పిండిని చిన్నచిన్న ముద్దల్లా చేసి చపాతీలా వత్తి పెనంపై రెండు వైపులా వాల్చాలి. చపాతీ చివర్లు తీసేసి సగానికి కట్ చేయాలి. ఇప్పుడు ఈ సగం చపాతీ ముక్కలన్నింటినీ తడిబట్టతో కలిపి చాపలా గుట్టి ఓ నిమిషం ఉంచి తీయాలి. ఇప్పుడు ఒక్కో ముక్కని తీసుకుని అందులో గుడ్డు మిశ్రమాన్ని పెట్టి సమోసాలా మడిచి కాగే నూనెలో డీప్​ ఫ్రై చేయాలి.

ఎగ్​ పచ్చడి తయారీకి కావలసినవి

  • కోడిగుడ్లు (ఉడికించినవి)- రెండు డజన్లు
  • కారం- అరకేజీ
  • ఉప్పు- 400 గ్రాములు
  • పసుపు, మెంతులు- ఒక్కోటి నాలుగు టీ స్పూన్లు
  • ఎండుమిర్చి– పది
  • చింతపండు- అరకేజి
  •  నూనె సరిపడా

ఎగ్​ పచ్చడి తయారీ విధానం

మెంతుల్ని వేయించి పొడి చేయాలి. పాన్​లో సరిపడ నూనె  వేడి చేసి కోడిగుడ్లను ఉడికించాలి. చింతపండులో సరిపడా నీళ్లు పోసి మరిగించి గుజ్జు రెడీ చేయాలి. ఓ గిన్నెలో కారం, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతిపిండి, నూనె తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరోసారి కలపాలి. మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్రతో తాలింపు పెట్టి పచ్చడిపై వేసి బాగా కలపాలి. 

 

©️ VIL Media Pvt Ltd.