
బెంగళూరులో వెలుగులోకి వచ్చిన ఓ క్యాష్ ఆన్ డెలివరీ (COD) స్కామ్ ఘటన ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులను అలర్ట్ చేస్తోంది. ఓ మహిళ తాను ఆర్డర్ చేయని పార్సెల్‌కు రూ.500 చెల్లించాలని డెలివరీ బాయ్ అడిగాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నకిలీ COD స్కామ్‌లపై డిస్కషన్ మెుదలైంది నెట్టింట.
వైరల్ వీడియోలో మహిళ తన ఇంటికి వచ్చిన డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను ప్రశ్నిస్తూ కనిపించింది. “నేను ఎలాంటి వస్తువు ఆర్డర్ చేయలేదు. మరి దీనికి ఎందుకు డబ్బులు చెల్లించాలి?” అంటూ ఆమె డెలివరీ సంస్థ ప్రతినిధిని వివరణ కోరింది. అనంతరం డెలివరీ ఏజెంట్ ఫోన్‌లో మరో వ్యక్తిని సంప్రదించగా.. మహిళ తనకు తెలియకుండా ఆర్డర్ సృష్టించి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం జరుగుతోందని వీడియోలో వెల్లడించింది.
⚠️ Karnataka, Stay Alert!
Bengaluru resident Sowmya Suresh has shared an alarming experience. According to her, a ₹500 Cash on Delivery (COD) parcel arrived at her home in her name and address, even though she had never placed such an order. After refusing to pay and opening… pic.twitter.com/mdaW8dFwYY
— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) August 4, 2026
అయితే ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి మాత్రం ఆ ఆర్డర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వచ్చిందని చెప్పాడు. దీనిని మహిళ ఖండించి, తాను ఎలాంటి ఆర్డర్ చేయలేదని స్పష్టం చేసింది. తర్వాత పార్సెల్ తెరిచి చూడగా అందులో విలువైన వస్తువు ఏమీ లేకుండా పాడైన బాక్స్‌లో సగం సబ్బు మాత్రమే ఉన్నట్లు తేలింది. ఇది ముమ్మాటికీ స్కామర్స్ పనేనని ఆమె ఆరోపించింది.
ఇలాంటి COD మోసాల్లో కేటుగాళ్లు సాధారణంగా వినియోగదారుల చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఉపయోగించి చిన్న మొత్తాల్లో నకిలీ పార్సెల్స్ పంపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది తక్కువ మొత్తం కాబట్టి పెద్దగా ఆలోచించకుండా డబ్బులు చెల్లించి మోసపోతుంటారు.
ALSO READ : E20 పెట్రోల్ బంద్ చేస్తారా లేదా..
ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము ఆర్డర్ చేయని పార్సెల్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించకూడదు. అనుమానం ఉంటే డెలివరీ వివరాలు, ఆర్డర్ సమాచారం తప్పనిసరిగా చెక్ చేయాలి. అలాగే పాత పార్సెల్ బాక్సులను పడేసే ముందు వాటిపై ఉన్న మీ పేరు, అడ్రెస్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలున్న లేబుళ్లను తొలగించడం మంచిదని సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా సైబర్ మోసాలకు అవకాశం ఇవ్వొచ్చని నిపుణులు అంటున్నారు.