
మెదక్టౌన్, వెలుగు: చిన్నారులకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరమని, పిల్లలు పుట్టిన గంటలోపు తల్లిపాలను తాగించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో తల్లి పాల వారోత్సవాల పోస్టర్లను అడిషనల్కలెక్టర్నగేశ్, డీడబ్ల్యూవో హేమభార్గవితో కలిసి ఆవిష్కరించారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతకుముందు నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తల్లిపాలపై అవగాహన కల్పించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లి పాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన వరమన్నారు. జిల్లాలో అంగన్వాడీ సెంటర్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు ప్రజావాణిలో 55 ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చెన్నయ్య, దేవ సహాయం, డీఆర్డీవో పాండు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.