Reading Time: 2 minutes
Charminar Set Built In Gachibowli For Prabhas Period Action Film Fauji

Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ప్రతి అప్‌డేట్‌ ను అభిమానులు పండగలా జరుపుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వార్త అభిమానుల్లో మరింత జోష్ ను పెంచుతోంది. మామూలుగా చార్మినార్ అంటే హైదరాబాద్ పాతబస్తీనే మనకు గుర్తుకు వస్తుంది. కానీ త్వరలో గచ్చిబౌలిలో కూడా మరో ‘చార్మినార్’ కనిపించబోతోంది. అయితే అది చారిత్రక కట్టడం కాదు, ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సినిమా సెట్ అది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ మూవీ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. సినిమా తదుపరి షెడ్యూల్ కోసం గచ్చిబౌలి–లింగంపల్లి రోడ్డులోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో అసలు చార్మినార్‌ను పోలిన భారీ సెట్ ను చిత్ర బృందం నిర్మిస్తోంది. ఈ సెట్‌లోనే సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆగస్టు 3 నుంచి ప్రారంభమైన 25 రోజుల షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తవుతుందని సమాచారం. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి నిర్ణయించిన సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

అసలు చార్మినార్ వద్ద షూటింగ్ చేయకుండా ప్రత్యేక సెట్ నిర్మించడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. ప్రభాస్‌కు ఉన్న భారీ అభిమాన గణం కారణంగా పాతబస్తీలో షూటింగ్ నిర్వహిస్తే వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు, భద్రతా ఏర్పాట్లు, షూటింగ్ అంతరాయం వంటి అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే అదే వాతావరణాన్ని గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి నిర్మించాలని చిత్ర బృందం నిర్ణయించింది. దీంతో షూటింగ్ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగనుంది. ఇదిలా ఉండగా ‘ఫౌజీ’ విడుదలపై వస్తున్న పుకార్లకు కూడా నిర్మాతలు ఇటీవలే చెక్ పెట్టారు. సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, నిర్మాత రవిశంకర్ అధికారికంగా స్పందిస్తూ మొదట ప్రకటించిన తేదీ ప్రకారమే డిసెంబర్ 3, 2026న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సుమారు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాతో ఇమాన్వి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ పీరియడ్ రొమాంటిక్ వార్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు తో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు గచ్చిబౌలిలో నిర్మిస్తున్న భారీ ‘చార్మినార్’ సెట్ వార్తతో ‘ఫౌజీ’పై మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.