Reading Time: 2 minutes

మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన అమెరికా క్రికెటర్.. అఖిలేష్ రెడ్డిపై 8 ఏళ్ల బ్యాన్

Caption of Image.

USA Cricketer Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడినందుకు అమెరికా క్రికెటర్ అఖిలేష్ రెడ్డిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఉక్కుపాదం మోపింది. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించిన అమెరికా క్రికెటర్ పై అన్ని రకాల క్రికెట్ మ్యాచ్‌ల నుంచి 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది. 2025లో యూఏఈ వేదికగా జరిగిన అబుదాబి టీ10 లీగ్ టోర్నమెంట్‌లో అఖిలేష్ అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ తేల్చింది. 2025 నవంబర్ 21వ తేదీన ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేయగా, ఇప్పుడు ఆ నిషేధాన్ని అధికారికంగా 8 ఏళ్లకు పొడిగించింది. 

ఐసీసీ ప్రధాన ఆరోపణలు:

* మ్యాచ్‌ ఫలితాన్ని లేదా మ్యాచ్‌లోని కొన్ని అంశాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం.
* మరో ఆటగాడిని అవినీతికి పాల్పడేలా ప్రోత్సహించడం.
* ఐసీసీ విచారణకు అడ్డంకులు సృష్టించడం.

సహచర ఆటగాడిని ప్రలోభపెట్టే యత్నం: 

2025 నవంబర్ 19వ తేదీన టోర్నమెంట్‌లో అస్పిన్ స్టాలియన్స్ జట్టు తొలి మ్యాచ్ ఆడటానికి ముందు హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జట్టు మేనేజ్‌మెంట్ సూచన మేరకు, మ్యాచ్‌లో కావాలనే ఎక్కువ రన్స్ సమర్పించాలని అఖిలేష్ రెడ్డి తన తోటి ఆటగాడిని కోరాడు. అయితే అతడు ఆ ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా, వెంటనే ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) కు ఫిర్యాదు చేశాడు. విచిత్రమేమిటంటే.. ఫిర్యాదు చేసిన ఆ ఆటగాడిని ఆ తర్వాత తుది జట్టు నుంచి తప్పించారు.

దర్యాప్తులో దొరికిపోయిన అఖిలేష్ రెడ్డి:

ఈ ఘటనపై విచారణ సందర్భంగా అఖిలేష్ రెడ్డి తన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. తన సహచర ఆటగాడితో జరిపిన వాట్సాప్ చాట్‌లు, కాల్ రికార్డ్స్‌ను అదే రోజు ఉదయం డిలీట్ చేశాడు. తాను కేవలం ఫోన్ డేటాను క్లీన్ చేశానని (Routine data hygiene) వాదించినప్పటికీ.. ట్రిబ్యునల్ దానిని నమ్మలేదు. విచారణకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలను ఆయన ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారని తేల్చింది. మైఖేల్ జె బెలాఫ్ కేసీ, జస్టిస్ కేట్ ఓ’రీగన్, లాయ్డ్ మిషీలతో కూడిన ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది.

అఖిలేష్ రెడ్డి క్రికెట్ నేపథ్యం:

26 ఏళ్ల అఖిలేష్ రెడ్డి.. నార్త్ అమెరికా టీ20 కప్‌లో కేమన్ ఐలాండ్స్‌పై అమెరికా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అమెరికా తరఫున 4 టీ20 మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ పడగొట్టాడు.

 

 

©️ VIL Media Pvt Ltd.