
తమిళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించిందేనంటూ.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ తో టీవీకే నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అటు ఉదయనిధి స్టాలిన్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉదయనిధిపై సీరియస్..
కావేరి జల వివాదంపై జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలకు రాజకీయ వర్గాల నుంచి సినీ ప్రముఖుల వరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వివాదంలో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, నటి,-రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఘాటుగా స్పందించారు. రాజకీయ నాయకులు ప్రజల సమస్యలపై మాట్లాడాలి తప్ప, రాజకీయాలకు సంబంధం లేని మహిళలను లాగడం దారుణం అంటూ చిన్మయి మండిపడ్డారు. మొదట ఉదయనిధి వ్యాఖ్య అసలు అర్థం తనకు అర్థం కాలేదని, తర్వాత అందులోని ద్వంద్వార్థాన్ని తెలిసి షాక్‌కు గురయ్యానని ఆమె వెల్లడించారు. కనీసం కార్యకర్తలను అదుపులో పెట్టాల్సిందిపోయి, పరిస్థితిని మరింత దిగజార్చేలా మాట్లాడటం బాధాకరమని విమర్శించారు.
క్షమాపణ చెప్పాల్సిందే..
మరోవైపు ఖుష్బూ సుందర్ కూడా ఉదయనిధిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల గౌరవాన్ని రాజకీయ పోరాటంలో బలిపశువుగా మార్చడం సిగ్గుచేటని, ప్రజా వేదికలపై మాట్లాడేటప్పుడు హద్దులు ఉండాలని స్పష్టం చేశారు. త్రిషను అవమానించినందుకు ఉదయనిధి వెంటనే బహిరంగంగా, ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Heard #Udhayanidhi Stalin’s speech. It was crass, cheap and deeply derogatory; reflecting the very political culture he seems eager to inherit.
If those with such a mindset aspire to lead a political party and one day govern the state, then God help us. What else can one expect…
— KhushbuSundar (@khushsundar) August 4, 2026
అసలేం జరిగిందంటే?
అసలు వివాదానికి కారణం తంజావూరులో జరిగిన డీఎంకే నిరసన సభ. కావేరి వివాదంపై ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తల్లో కొందరు త్రిష.. త్రిష అంటూ పేరు నినదించగా, ఉదయనిధి చేసిన వ్యాఖ్య ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి దారి తీసింది. తాను కావేరి నదినే ఉద్దేశించి మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చినా.. విమర్శకులు మాత్రం అది త్రిషను లక్ష్యంగా చేసుకున్న ద్వంద్వార్థ వ్యాఖ్యేనని ఆరోపిస్తున్నారు.