Reading Time: 2 minutes

రిఫరల్ సెంటర్ గా నిజామాబాద్ హాస్పిటల్..అత్యాధునిక ఎంఆర్‌‌ఐ మెషిన్ ఏర్పాటు..

Caption of Image.
  •     జిల్లా ఎమ్మెల్యేల సమీక్షలో మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌‌(జీజీహెచ్‌‌)ను ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేలా ప్రధాన రిఫరల్ సెంటర్‌‌గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని సెక్రటేరియట్‌‌ లో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

జిల్లా ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్‌‌ కు రావాల్సిన అవసరం లేకుండా జీజీహెచ్‌‌లో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌‌ఐ మెషిన్ ను కొనుగోలు చేస్తున్నామని, ప్రజలకు త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

 ఈ సందర్భంగా జిల్లాలోని  హాస్పిటల్స్ అభివృద్ధిపై ఎమ్మెల్యేలు పలు సూచనలు చేయగా.. అంకాపూర్‌‌ లో పీహెచ్‌‌సీ మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే నందిపేట్ పీహెచ్‌‌సీని సీహెచ్‌‌సీగా అప్‌‌ గ్రేడ్ చేయడం, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం గణనీయంగా పెరిగిందని, నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి హాస్పిటల్స్ లో బెడ్ల కోసం రోజూ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌‌ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

జిల్లాల్లోని హాస్పిటల్స్ ను బలోపేతం చేస్తేనే హైదరాబాద్‌‌ లోని ప్రధాన హాస్పిటల్స్ పై.. ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడగా, ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే పటిష్ట చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. జిల్లాలో సిబ్బంది కొరత లేకుండా ఇప్పటికే 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా స్పెషలిస్టులు, 22 మంది పిడియాట్రీషియన్లతో పాటు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లను నియమించామని, ఈ నెలాఖరుకల్లా జనరల్ మెడిసిన్, సర్జరీ, రేడియాలజీ విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 

మానవ వనరులు, మౌలిక వసతులు, వైద్య పరికరాలు, మందుల కొరత లేకుండా చూస్తూ.. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి.సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, భూపతి రెడ్డి, ధన్‌‌పాల్ సూర్యనారాయణ గుప్తా, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.