
బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ భారీ విజయం సాధించారు. దాదాపు 20 వేల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నిక కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు జరిగిన పోటీ కాదని.. బీహార్ నాయకత్వంపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన సందేశమని అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు.
‘‘సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని బీహార్ ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ.. నేరపూరిత ధోరణులు, వివాదాస్పద ప్రవర్తన ఉన్న వ్యక్తికి బీహార్ నాయకత్వాన్ని అప్పగించింది. ఇలాంటి నాయకత్వాన్ని బీహార్ ప్రజలు అంగీకరించడం లేదు’’ అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
బంకీపూర్ ఉప ఎన్నికకు ఒకే నియోజకవర్గాన్ని మించిన రాజకీయ ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఈ విజయం బంకీపూర్ ప్రజల విజయమని తెలిపారు. ఎన్నికల ప్రచారం సమయంలో చెప్పినట్లుగానే.. ఇది కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నిక కాదని స్పష్టం చేశారు. ‘‘బీహార్‌కు మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర ప్రజలు సందేశం పంపే ప్రయత్నమే ఈ ఎన్నిక. నేరపూరిత నేపథ్యం, వివాదాస్పద ప్రవర్తన, వ్యక్తిత్వం లేదా ప్రతిష్ఠపై ప్రశ్నలు ఉన్న వ్యక్తి బీహార్‌కు నాయకత్వం వహించడం ప్రజలకు ఇష్టం లేదు. విద్యా వ్యవస్థను మెరుగుపరచగల, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగల, ఉపాధి కోసం బీహార్ పిల్లలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించగల మంచి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ అభివృద్ధిపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టాలని ప్రశాంత్ కిషోర్ కోరారు. ప్రధాని మోడీ, బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడం, యువత వలసలను అరికట్టడం, బీహార్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి మోడీ, బీజేపీ, అమిత్ షా బీహార్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. యువతకు ఉద్యోగాలు కల్పించి, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలసలను అరికట్టాలి. అదే మా ప్రధాన లక్ష్యం. కాంట్రాక్టులు పొందడం కోసం మాత్రమే మేం ఎమ్మెల్యేలు కావాలని అనుకోవడం లేదు. బీహార్ అభివృద్ధి మాత్రమే మా లక్ష్యం’’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం గతంలో పాట్నా వెస్ట్‌గా ఉండేది. 1995 నుంచి ఈ నియోజకవర్గం బీజేపీకి అత్యంత బలమైన కంచుకోటగా కొనసాగుతోంది. తొలుత బీజేపీ నేత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించగా.. అనంతరం ఆయన కుమారుడు నితిన్ నబిన్ వరుసగా ఐదుసార్లు బంకీపూర్ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబిన్.. రాజ్యసభకు ఎన్నిక కావడంతో తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబిన్ 50 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో బంకీపూర్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్.. జన్ సురాజ్ పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. విద్య, ఉపాధి, క్షేత్రస్థాయి పాలన వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. తొలి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ విజయం సాధిస్తే.. జన్ సురాజ్ పార్టీ రాజకీయంగా మరింత బలపడే అవకాశం ఉంది. ఎన్డీయేతో పాటు మహాగఠ్‌బంధన్‌కు కూడా జన్ సురాజ్ పార్టీ బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి ఈ ఫలితం కీలక మలుపుగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.