
40 ఏళ్ల వయసు దాటిన తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అందులో కంటి చూపు సమస్య కూడా ఒకటి. ఈ వయసులో అత్యంత సాధారణ మార్పు ప్రెస్‌బయోపియా. కంటి లెన్స్ ఫ్లెక్సిబిలిటీ తగ్గడం వల్ల దగ్గర వస్తువులపై ఫోకస్ చేయడం కష్టమవుతుంది. అందుకే చాలా మందికి మొదటిసారి రీడింగ్ గ్లాసెస్ లేదా బైఫోకల్స్ అవసరమవుతాయి.
40 ఏళ్ల తర్వాత పెరిగే కంటి సమస్యలు:
క్యాటరాక్ట్ (కంటి లెన్స్ మబ్బు పట్టడం), గ్లాకోమా (నరాలకు హాని), డయాబెటిక్ రెటినోపతి (చక్కెర వ్యాధి ఉన్నవారిలో రెటినా రక్తనాళాలు దెబ్బతినడం), ఏజ్-రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్ (ఎఎమ్‌డి) మొదలైన సమస్యలు కంటి దృష్టిని ప్రభావితం చేస్తాయి.
కళ్ల ఆరోగ్యం కాపాడుకోవడానికి 7 టిప్స్:
కంటి పరీక్షలు చేయించుకోవడం
ప్రతి 1-2 సంవత్సరాలకు ఒకసారి కంటి పరీక్ష (డైలేటెడ్ ఐ ఎగ్జామ్) చేయించుకోవాలి. దీంతో ముందుగానే సమస్యలను గుర్తించవచ్చు.
20-20-20 రూల్ :
డిజిటల్ స్క్రీన్‌లపై ఎక్కువసేపు గడిపే వారైతే.. ప్రతి 20 నిమిషాలకు 20 ఫీట్ల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లపాటు చూడండి. ఇది ఐ స్ట్రెయిన్ తగ్గిస్తుంది.
కళ్లకు మంచి ఆహారం
ఆకుకూరలు, రంగురంగుల కూరగాయలు-,పండ్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు, లుటీన్, జియాజాంతిన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది.
యూవీ బ్లాక్ చేసే సన్‌గ్లాసెస్ :
యువి ఎ, యువి బి రేస్‌లను బ్లాక్ చేసే సన్‌గ్లాసెస్ క్యాటరాక్ట్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాలి:
షుగర్ వ్యాధి, బీపీ, కొలెస్ట్రాల్ వంటివి కళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి రాకుండా చూసుకోవాలి.
నీళ్లు ఎక్కువగా తాగాలి:
నీళ్లు ఎక్కువగా తాగటం వలన డ్రై ఐస్ సమస్య నుంచి బయట పడొచ్చు. స్క్రీన్ ముందు ఎక్కువసేపు ఉన్నప్పుడు కళ్లు అప్పుడప్పుడు మూసి తెరవాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవండి:
మబ్బుగా కనిపించడం, లైట్ లో ఫ్లాషెస్ వచ్చినట్లు కనిపించడం, కంటి నొప్పి వంటివి ఉంటే వెంటనే డాక్టర్ ను కలవండి.