
కుర్కురే, లేస్.. ఇలా పేరేదైనా కానీ… చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలామంది ప్యాకెట్లలో వచ్చే స్నాక్స్ కి అడిక్ట్ అయ్యారన్నది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఈ ప్యాకెట్లకు అలవాటు పడి అన్నం తినడం మానేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ మధ్య పిల్లలను అట్ట్రాక్ట్ చేసేందుకు స్నాక్స్ ప్యాకెట్లలో చిన్న చిన్న బొమ్మలు పెట్టి అమ్ముతున్నారు. అలా చిప్స్ ప్యాకెట్లో వచ్చిన బొమ్మ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. కర్ణాటకలోని మైసూరులో జరిగింది ఈ దారుణం. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
చిప్స్ ప్యాకెట్ లో వచ్చిన చిన్న టాయ్ బాల్ తో ఆడుకుంటూ.. పొరపాటున గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. కర్ణాటకలోని మైసూర్ జిల్లా గౌరీపుర గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు స్నాక్స్ ప్యాకెట్ తెచ్చుకొని తిన్నాడు. ఆ తర్వాత అందులో ఫ్రీగా వచ్చిన బాల్ తో కాసేపు ఆడుకున్నాడు.
అయితే.. బాల్ తో ఆడుకునే సమయంలో పొరపాటున దాన్ని మింగాడు బాలుడు. అది గొంతులో ఇరుక్కొని ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు.ఆ బాలుడు కుటుంబంలో ఏకైక సంతానం కావడంతో బంధువులతో పాటు గ్రామస్తులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.