
PCOD అనేది కేవలం మహిళల అండాశయాలలో ఏర్పడే తిత్తులకే పరిమితం కాదు. ఇది శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి ఇన్సులిన్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిల్లో తీవ్ర అసమతుల్యతకు కారణమవుతుంది. ఈ సమస్య తీవ్రతను తగ్గించాలంటే శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడం అత్యంత ముఖ్యం. దీనికి సహజ సిద్ధమైన పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు ‘ఇన్సులిన్ బ్యాలెన్స్ టీ’ని సూచిస్తున్నారు.
హార్మోన్ల సమతుల్యతకు మెంతులు, దాల్చినచెక్క టీ
మెంతులు, దాల్చినచెక్కల కలయిక జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ రాజేష్ బాయారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ టీ తాగడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరిగి, రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు అదుపులోకి వస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఋతుచక్రాన్ని (పీరియడ్స్) క్రమబద్ధీకరించడానికి, జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులను తొలగించడానికి ఇది సహాయపడుతుంది.
తయారీకి కావలసిన పదార్థాలు:
- మెంతులు – 1/4 టీస్పూన్
- దాల్చినచెక్క పొడి – చిటికెడు
- బే ఆకు (బిర్యానీ ఆకు) – 1
- లవంగాలు – 2
- నిమ్మరసం – సరిపడా
- నీరు – 1.5 కప్పులు
ఎలా తయారు చేయాలి?
ఒక పాత్రలో ఒకటిన్నర కప్పు నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అందులో మెంతులు, బే ఆకు, దాల్చినచెక్క పొడి, లవంగాలు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు చిన్న మంటపై మరగనివ్వాలి. అనంతరం స్టవ్ ఆపి, దించి అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఉదయాన్నే పరగడుపున ఈ టీని గోరువెచ్చగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంట్లో వాడే బే ఆకులు శరీరంలో వాపును తగ్గించగా, లవంగాలలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఇది పూర్తి చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు
కేవలం ఈ టీ తాగడం వల్లే PCOD పూర్తిగా నయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం అనుబంధ ఆహారంగా (Dietary Supplement) మాత్రమే ఉపయోగపడుతుంది. పిసిఓడి సమస్య ఉన్నవారు సరైన వైద్యుల సలహాతో పాటు క్రమంతప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర పాటించాలి. ముఖ్యంగా మధుమేహం మందులు వాడేవారు, గర్భిణులు, సంతాన సాఫల్య చికిత్స పొందుతున్న మహిళలు ఈ టీని నిత్యం తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.