Reading Time: 2 minutes

రెండున్నరేండ్లు.. 1,000 రోబోటిక్‌‌‌‌‌‌‌‌ సర్జరీలు..విజయవంతంగా పూర్తి చేసిన నిమ్స్ డాక్టర్లు

Caption of Image.
  • ఇందులో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్ ద్వారా ఫ్రీగా చేసినవే
  • 9 నెలల చిన్నారి నుంచి 83 ఏండ్ల వృద్ధుల వరకు సర్జరీలు సక్సెస్‌‌‌‌‌‌‌‌ 
  • ఎయిమ్స్ ఢిల్లీ, కిద్వాయ్ బెంగళూరు సరసన నిలిచిన హైదరాబాద్ నిమ్స్

హైదరాబాద్, వెలుగు: నిజాం ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్రభుత్వ వైద్య రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ హాస్పిటల్స్‌‌కే పరిమితమైన రోబోటిక్ సర్జరీలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రెండున్నరేండ్లలోనే 1,000 రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ప్రభుత్వ రంగంలో వెయ్యికి పైగా రోబోటిక్ ఆపరేషన్లు పూర్తి చేసిన ఢిల్లీ ఎయిమ్స్, బెంగళూరు కిద్వాయ్ వంటి ప్రతిష్టాత్మక నేషనల్ మెడికల్ ఇన్‌‌స్టిట్యూషన్ల సరసన నిమ్స్ స్థానం సంపాదించుకుంది. ఈ మొత్తం సర్జరీలలో 90 శాతానికి పైగా ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌‌ఎఫ్ స్కీమ్‌‌ల ద్వారా రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఉచితంగా నిర్వహించడం విశేషం.

మూడు డిపార్ట్‌‌మెంట్లు.. వెయ్యి సర్జరీలు

వెయ్యి రొబోటిక్ సర్జరీలలో అత్యధికంగా యూరాలజీ డిపార్ట్‌‌మెంట్ నుంచి 590 ఆపరేషన్లను నిర్వహించారు. ఇందులో ప్రోస్టేట్ క్యాన్సర్‌‌‌‌కు చేసే రాడికల్ ప్రోస్టేటెక్టోమీ, బ్లాడర్ క్యాన్సర్‌‌‌‌కు చేసే రాడికల్ సిస్టెక్టోమీ, కాంప్లెక్స్ రొబోటిక్ రీనల్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్, యూరో- గైనకాలజికల్ ప్రొసీజర్లు, యూరో రీకన్‌‌స్ట్రక్టివ్ విధానాలైన బోరి ఫ్లాప్, యురేటరిక్ రీఇంప్లాంటేషన్, పయేలోప్లాస్టీస్ (పిడియాట్రిక్ పయేలోప్లాస్టీ సహా) వంటి సంక్లిష్ట సర్జరీలు ఉన్నాయి. ఇక సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డిపార్ట్‌‌మెంట్ ఆధ్వర్యంలో వివిధ రకాల క్యాన్సర్లు, ఇతర వ్యాధులకు సంబంధించి 248 ఆపరేషన్లు చేశారు. సర్జికల్ అంకాలజీ డిపార్ట్‌‌మెంట్ నుంచి 162 ఆపరేషన్ల ద్వారా ఓవేరియన్, యూటెరైన్, కొలోరెక్టల్ క్యాన్సర్ రోగులకు శస్త్రచికిత్సలు అందించారు. 

9 నెలల పాప నుంచి 83 ఏండ్ల వృద్ధుల వరకు.. 

ఈ రోబోటిక్ సర్జరీల్లో వయసుతో నిమిత్తం లేకుండా 9 నెలల పసిపాప (పిడియాట్రిక్ పయేలోప్లాస్టీ) నుంచి 83 ఏండ్ల వృద్ధుల వరకు విభిన్న వయో వర్గాల పేషెంట్లకు వైద్యాన్ని అందించి పునర్జన్మనిచ్చారు. సంప్రదాయ ఆపరేషన్లతో పోలిస్తే రోబోటిక్ టెక్నాలజీ వల్ల సర్జరీ సమయంలో కోత చిన్నదిగా ఉండి రక్తస్రావం కాకపోవడం, తీవ్రమైన నొప్పి ఉండకపోవడం, ఇన్ఫెక్షన్ల భయం లేకపోవడంతో రోగులు త్వరగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌‌ అయ్యే వెసులుబాటు కలిగింది. సౌతిండియాలోనే ప్రభుత్వ రంగంలో తొలి రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌ను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్.. ఇటీవల 2,000 కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంట్ సర్జరీలను కూడా పూర్తి చేసుకొని దేశంలోనే ప్రముఖ ఆర్గాన్ ట్రాన్స్‌‌ప్లాంట్ సెంటర్లలో ఒకటిగా నిలిచింది.

త్వరలో టిమ్స్, గాంధీ, ఉస్మానియాలోనూ.. 

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో నిమ్స్, ఎంఎన్‌‌జే క్యాన్సర్ హాస్పిటల్స్‌‌లో రోబోటిక్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా నిర్మాణంలో ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సనత్ నగర్ టిమ్స్, మిగతా రెండు టిమ్స్‌‌లతో పాటు గాంధీ హాస్పిటల్, కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్‌‌లోనూ అత్యాధునిక రోబోటిక్ ఆపరేషన్ థియేటర్ల (ఓటీ)ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది. ఈ సేవలను విస్తరించడం ద్వారా ప్రపంచస్థాయి వైద్య సేవలను పేదలకు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. 

మరిన్ని మైలురాళ్లు సాధించాలి

నిమ్స్‌‌లో రెండున్నరేండ్లలో వెయ్యి రోబోటిక్ సర్జరీలు పూర్తి చేయడం సంతోషంగా ఉంది. ఇందులో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్​ ద్వారా ఫ్రీగా నిర్వహించడం గొప్ప విషయం. ప్రజా ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. నిమ్స్ డాక్టర్ల టీమ్ ఇతర సిబ్బందికి అభినందనలు. ఇటీవల రెండు వేల కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంట్ సర్జరీలను పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రోబోటిక్ సర్జరీలు చేసి రికార్డు నెలకొల్పింది. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలి.
– సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ రంగంలోనే ప్రపంచస్థాయి వైద్యం.. 

నిమ్స్‌‌లో గతంలో 2 వేల కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంట్‌‌లు, ప్రస్తుతం వెయ్యి రోబోటిక్ సర్జరీలు జరగడం ప్రభుత్వ వైద్య రంగ సామార్థ్యానికి నిదర్శనం. సౌతిండియాలోనే ప్రభుత్వ రంగంలో తొలి రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌‌ ప్లాంట్‌‌ను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్, దేశంలోనే ప్రముఖ ఆర్గాన్ ట్రాన్స్‌‌ప్లాంట్ సెంటర్లలో ఒకటిగా నిలిచింది. త్వరలో మరిన్నీ ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లో రోబోటిక్ సేవలను అందుటులోకి తెస్తాం 
 – దామోదర రాజనర్సింహ, హెల్త్‌‌ మినిస్టర్‌‌‌‌

సమష్టి కృషితోనే ఈ విజయం.. 

నిమ్స్ యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ అంకాలజీ, అనస్థీషియా డిపార్ట్‌‌మెంట్లు.. ఇతర సిబ్బంది సమిష్టి కృషితోనే తక్కువ వ్యవధిలోనే వెయ్యి రోబోటిక్ సర్జరీలను పూర్తి చేయగలిగాం. ఆర్థిక కారణాల వల్ల పేదలు ఖరీదైన రోబోటిక్ వైద్యాన్ని దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే 90 శాతానికి పైగా సర్జరీలు ఉచితంగా నిర్వహించాం. సర్జరీలను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లకు అభినందనలు.  – డాక్టర్ 

రాహుల్ దేవరాజ్, నిమ్స్ డైరెక్టర్ 

©️ VIL Media Pvt Ltd.