
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెరవెనుక అమెరికాతో చర్చలకు ప్రయత్నిస్తూ.. బహిరంగంగా మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ చెబుతోందని ఆరోపించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే లేదా ఆ దేశం పూర్తిగా లొంగిపోకపోతే.. తమ అనుమతి లేకుండా ఎలాంటి సరఫరాలు ఇరాన్‌కు చేరవని హెచ్చరించారు ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో సోమవారం చేసిన పోస్టులో.. ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
‘‘ఇరాన్ నాయకత్వం నమ్మశక్యం కాని విధంగా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. వారు అమెరికాతో సమావేశం కావాలని కోరుతున్నారు. కొందరు దానిని వేడుకోవడంగా కూడా చెప్పవచ్చు. చర్చలు ప్రారంభమయ్యాయి. సమీప భవిష్యత్తులో మరిన్ని చర్చలు కూడా జరగనున్నాయి. కానీ బహిరంగంగా మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని గర్వంగా చెబుతున్నారు. తాము కేవలం ఒమన్‌తో మాత్రమే చర్చలు జరుపుతున్నామని ప్రకటిస్తున్నారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో.. ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పశ్చిమాసియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. హోర్ముజ్ జలసంధిని తామే శక్తివంతంగా నిర్వహిస్తామని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. అది ఇప్పటికే పూర్తిగా అమెరికా నౌకాదళం నియంత్రణలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘హోర్ముజ్ జలసంధిని తాము శక్తివంతంగా నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. కానీ అది ఇప్పటికే పూర్తిగా అమెరికా నౌకాదళం నియంత్రణలో ఉంది. మా దిగ్బంధనం లేదా కొందరు చెప్పే విధంగా అమెరికా ఉక్కు గోడ అక్కడ ఉంది’’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
అమెరికా అనుమతి లేకుండా ఇరాన్‌కు ఎలాంటి సరఫరాలు చేరవని కూడా ట్రంప్ హెచ్చరించారు ‘‘మేం అనుకుంటే తప్ప ఇరాన్‌కు ఏదీ చేరదు. ఒక ఒప్పందం కుదరకపోతే లేదా ఇరాన్ పూర్తిగా లొంగిపోకపోతే.. ఇకపై కూడా ఏ సరఫరా అక్కడికి చేరదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసిన ట్రంప్.. టెహ్రాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండనివ్వబోమని తేల్చిచెప్పారు. ‘‘ఇరాన్ దీనిని అంగీకరించినా, అంగీకరించకపోయినా.. దశాబ్దాలుగా వారు సృష్టించిన ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే అంశంపైనే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘విషయం చాలా సులభం. ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవలి వారాల్లో ఇరాన్‌పై ట్రంప్ చేసిన అత్యంత తీవ్రమైన బహిరంగ వ్యాఖ్యల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. తెరవెనుక దౌత్య చర్చలు జరుగుతున్నాయనే ఆరోపణలతో పాటు.. ఇరాన్ అణు కార్యక్రమం, గల్ఫ్ ప్రాంతంలోని సముద్ర మార్గాలపై టెహ్రాన్ ప్రభావం విషయంలో ట్రంప్ మరోసారి కఠిన హెచ్చరికలు చేశారు. అయితే ట్రంప్ ఆరోపణలపై ఇరాన్ నుంచి వెంటనే ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.