Reading Time: < 1 minute
గర్భధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసి వైద్యులే షాక్..

ఢిల్లీలోని వైద్యులు అత్యంత అరుదైన గర్భధారణకు విజయవంతంగా చికిత్స అందించారు. సాధారణంగా గర్భం గర్భాశయంలో పెరుగుతుంది. కానీ ఈ మహిళ విషయంలో పిండం గర్భాశయం వెలుపల, కిడ్నీల సమీపంలోని ఉదర భాగంలో పెరగడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యాధునిక కీహోల్ (లాపరోస్కోపిక్) శస్త్రచికిత్స ద్వారా ఈ క్లిష్టమైన కేసును విజయవంతంగా నిర్వహించారు.

బెంగళూరుకు చెందిన ఓ మహిళ సాధారణ గర్భధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. అల్ట్రాసౌండ్ పరీక్షలో 10 నుంచి 12 సెంటీమీటర్ల పరిమాణంలో సిస్ట్‌లాంటి నిర్మాణం కనిపించింది. అందులో పిండం భాగాలు కనిపించడంతో తొలుత వైద్యులు దాన్ని డెర్మాయిడ్ సిస్ట్‌గా భావించారు. అయితే అనంతరం నిర్వహించిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో అసలు విషయం బయటపడింది.

ఎంఆర్‌ఐలో గర్భాశయ గోడ చిట్లిపోయినట్లు గుర్తించారు. ఆ చీలిక కారణంగా గర్భం గర్భాశయం నుంచి బయటకు వచ్చి, కిడ్నీలకు సమీపంలోని రెట్రోపెరిటోనియల్ స్పేస్‌లో పెరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో శరీరంలోని ప్రధాన రక్తనాళాలు అయిన అయోర్టా, ఇన్‌ఫీరియర్ వెనా కావా ఉండటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.

వైద్యుల పరిశీలనలో సుమారు 12 వారాల వయస్సు ఉన్న, 7 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు గల పిండం ఆ సిస్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అత్యంత జాగ్రత్తగా లాపరోస్కోపిక్ (కీహోల్) శస్త్రచికిత్స నిర్వహించి పిండాన్ని తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ కేసుపై స్పందించిన ఎలాంటిస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ప్రసూతి-స్త్రీరోగ నిపుణుడు డాక్టర్ మన్నన్ గుప్తా మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసు అని తెలిపారు. సాధారణంగా ఎక్టోపిక్ గర్భధారణ ఫాలోపియన్ ట్యూబ్ లేదా అండాశయంలో ఏర్పడుతుందని, కానీ ఈ మహిళలో గర్భం గర్భాశయంలో కాకుండా కిడ్నీల సమీపంలోని ఉదర భాగంలో పెరగడం అత్యంత అరుదైన ఘటన అని చెప్పారు. ఈ తరహా కేసులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా నమోదవుతాయని ఆయన వివరించారు.