Reading Time: < 1 minute
T Dilip Steps Down Team India Fielding Coach Subhadeep Ghosh Replaces Him

భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన టి. దిలీప్ దాదాపు ఐదేళ్ల తన పదవీకాలాన్ని విజయవంతంగా ముగించుకుని టీమిండియా నుంచి వైదొలిగారు. 2021 నవంబర్‌లో భారత జట్టు సెటప్‌లోకి అడుగుపెట్టిన ఆయన స్థానంలో బీసీసీఐ శుభదీప్ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టెస్టు సిరీస్ శుభదీప్‌కు మొదటి అసైన్‌మెంట్ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో ఐదేళ్ల అనుబంధం ముగియడంపై టి. దిలీప్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు.

ఈ ఐదేళ్ల పయనం చాలా అద్భుతంగా సాగిందని, తన భావాలను వ్యక్తపరచడానికి సరైన పదాలు దొరకడం లేదని దిలీప్ పేర్కొన్నారు. మొదటి రోజు నుంచే వంద శాతం శ్రమించాలనే లక్ష్యంతో పనిచేశానని, తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ రంగానికి ఫీల్డింగ్ ద్వారా సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో తాను ప్రతిపాదించిన ‘బెస్ట్ ఫీల్డర్ మెడల్’ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, ఆ జ్ఞాపకాలు తన గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయని వెల్లడించారు.

 

View this post on Instagram

 

A post shared by T Dilip (@dilip.tk19)

దిలీప్ పదవీకాలంలో భారత జట్టు అద్భుతమైన విజయాలను అందుకుంది. టీమిండియా 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 2023, 2025 లలో ఆసియా కప్‌లను ముద్దాడింది. 2023 వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2021-23) లలో రన్నరప్‌గా నిలిచింది.

తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన బీసీసీఐకి, మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌లకు దిలీప్ ధన్యవాదాలు తెలిపారు. తన హయాంలో నాయకత్వం వహించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందించిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, ఒక సువర్ణాధ్యాయం ముగిసినప్పటికీ ఐదేళ్లపాటు టీమిండియా బాడ్జ్ ధరించడం ఎప్పటికీ గర్వకారణంగా ఉంటుందని ఆవేదనతో వీడ్కోలు పలికారు.