
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన కుమారుడు రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ విరాళం ఇచ్చారు. చిరంజీవి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డుల్లో ఎన్టిఆర్ జాతీయ బహుమతిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు వచ్చిన రూ.10 లక్షలను స్వచ్ఛంద సంస్థలకు విరాళమిచ్చారు.
పలువురు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, అంధుల కోసం పని చేస్తున్న దేవనార్ ఫౌండేషన్, చిన్నారులను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కూడా మెగాస్టార్ విరాళం ఇచ్చారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌ని కలిసిన వృద్ధులను మెగాస్టార్ తన బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించారు. వారందరికీ బర్త్‌డే గిఫ్ట్‌గా కొత్త దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం తానే స్వయంగా వారందరికీ భోజనాలు పెట్టించారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.