
వివాహితుడు ఒక మహిళతో పరస్పర సమ్మతితో సహజీవన సంబంధంలో ఉంటే అది నేరం కాదని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో నైతికత (మొరాలిటీ) కంటే చట్టమే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. ఒక వివాహితుడు, ఒక మహిళతో పరస్పర అంగీకారంతో సహజీవన బంధంలో ఉంటే, దాన్ని ఏ విధంగానూ నేరంగా పరిగణించలేం. చట్టం, నైతికత రెండూ వేరువేరు. చట్టపరంగా నేరం లేనప్పుడు, సామాజిక అభిప్రాయాలు లేదా నైతిక విలువలు కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయవు అని ధర్మాసనం పేర్కొంది.ఈ కేసులో సంబంధిత మహిళ స్వచ్ఛందంగానే ఆ వ్యక్తితో కలిసి జీవిస్తున్నానని పోలీసులకు తెలిపినప్పటికీ, కుటుంబ సభ్యుల నుంచి గౌరవ హత్య (ఆనర్ కిల్లింగ్) బెదిరింపులు ఉన్నప్పటికీ పోలీసులు స్పందించలేదని కోర్టు గమనించింది. పెద్దవారైన ఇద్దరు కలిసి జీవిస్తే వారి రక్షణ బాధ్యత పోలీసులదేనని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనా ధర్మాసనం మాట్లాడుతూ, ఈ ఫిర్యాదుపై పోలీసు సూపరింటెండెంట్ చర్యలు తీసుకోకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు పెద్దవారు కలిసి జీవించే హక్కును కాపాడటం పోలీసుల కర్తవ్యం అని పేర్కొంది.ఈ కేసుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు, ఏప్రిల్ 8కి విచారణను వాయిదా వేసింది. అంతవరకు ఆ జంటకు తక్షణ రక్షణ కల్పించాలని ఆదేశించింది. వారి భద్రతకు షాజహాన్పూర్ ఎస్పీ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉపశమనం కల్పించిన కోర్టు, అనామిక, నేత్రపాల్‌లను అరెస్ట్ చేయరాదని ఆదేశించింది. అలాగే మహిళ కుటుంబ సభ్యులు ఆ జంటకు హాని చేయకుండా, వారి నివాసానికి రావడం లేదా ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదించడం కూడా నిషేధించింది.