Reading Time: < 1 minute

ఆర్టీసీ సమ్మెపై మార్చ్ 25న చర్చలు

Caption of Image.
  • హాజరుకావాలని యాజమాన్యానికి, జేఏసీ నేతలకు లేబర్ కమిషనర్ నోటీసులు
  •     చర్చలకు తలుపులు తెరిచే ఉంటయ్ : మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసు గడువు దగ్గర పడుతుండడంతో చర్చలకు రావాలని సంస్థ యాజమాన్యానికి, జేఏసీ నేతలకు కార్మిక శాఖ నోటీసులు పంపించింది. ఈ నెల 25 న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని అంజయ్య భవన్ లో చర్చలకు రావాలని ఇరువర్గాలకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్ దాస్ సూచించారు. సమ్మె నోటీసు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అందుకు తగిన కారణాలు, ఆధారాలతో రావాలని జేఏసీ నేతలకు సూచించిన జాయింట్ కమిషనర్.. ఆర్టీసీ తరఫున నిర్ణయాధికారం ఉన్న ఆఫీసర్లు మాత్రమే పాల్గొనాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం.

ఆర్టీసీలో సమ్మె సైరన్ కు ప్రభుత్వానికి ఈ నెల 26 వరకు జేఏసీ డెడ్ లైన్ విధించింది. దీంతో ఈలోపే సమస్యకు పరిష్కారం చూపే దిశగా లేబర్ కమిషనర్ చర్చలకు ఆహ్వానించారు. గతంలో మాదిరిగానే ఈ నెల 25న చర్చలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఏదో ఒక సాకుతో గైర్హాజరై, చర్చలను వాయిదా వేస్తే.. ఇంతకు ముందే ప్రకటించినట్టుగా ఈ నెల 26 తర్వాత సమ్మె తేదీ ప్రకటిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.  

రెండూ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నయ్​: మంత్రి పొన్నం

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోపాటు సంస్థలోకి యూనియన్లను అనుమతించాలనే రెండు ప్రధాన డిమాండ్లను జేఏసీ నేతలు ప్రభుత్వం ముందు పెడ్తున్నారని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని.. మిగతా అంశాలపైనా నేతలతో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు.

ఈ అంశంపై సోమవారం మీడియా ఎదుట మంత్రి స్పందించారు. కార్మికులు సమ్మెకు వెళ్తారని తాను అనుకోవడం లేదన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరవలేనిదని, ఈ స్కీంతో సంస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.