Reading Time: 2 minutes
Kangana Ranaut 40th Birthday Celebration Pm Modi Meeting Updates

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈరోజు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఏడాది తన పుట్టినరోజును ఆమె అత్యంత ప్రత్యేకంగా, ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరుపుకున్నారు.

READ ALSO: War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్ పై దాడులకు బ్రేక్..

ప్రధానితో చిరస్మరణీయ భేటీ..
తన పుట్టినరోజు సందర్భంగా కంగనా కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా కంగనా హిమాచల్ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రధానికి ఒక శాలువాను స్వయంగా కప్పారు. ఆమె సోదరుడు అక్షత్ రనౌత్.. ‘దశావతారాన్ని’ అద్భుతంగా చిత్రీకరించిన ఇత్తడి వాల్ ఫ్రేమ్‌ను ప్రధానికి బహుమతిగా అందజేశారు. ప్రధాని మోడీ కంగనా కుటుంబంతో సరదాగా గడిపారు. ముఖ్యంగా కంగనా మేనల్లుడితో ప్రధాని ఆడుకుంటున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. “ఈరోజు నా కుటుంబంతో పాటు గౌరవనీయ ప్రధానమంత్రి గారి సమయాన్ని, మార్గదర్శకత్వాన్ని పొందడం నా అదృష్టం. ఇది నాకు మర్చిపోలేని పుట్టినరోజు” అంటూ కంగనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

రాజకీయాల్లో బిజీ.. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఎప్పుడంటే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంగనా రాజకీయాల్లో ఎంతో చురుకుగా ఉంటున్నారు. ఆమె దర్శకత్వం వహించి నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అభిమానులు ఆమెను మళ్లీ వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంగనా చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. గతంలో ‘తను వెడ్స్ మను’ వంటి హిట్స్ ఇచ్చిన ఆర్.మాధవన్‌తో కలిసి ఆమె రెండు సినిమాల్లో నటించనున్నారు. అందులో ఒక చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రాబోయే తను వెడ్స్ మను 3 హిట్ ఫ్రాంచైజీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

READ ALSO: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్‌ఆర్ఆర్‌’ రికార్డులు బ్రేక్