
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి చీఫ్ మమతాబెనర్జీ, “సర్”( ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) బాధితులైన కుటుంబాలు, పార్టీ నాయకులతో కలిసి చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను సోమవారం కలుసుకున్నారు. గతవారం సిఇసి కుమార్ సోమవారం కలుసుకోవడానికి బెనర్జీకి సమయం కల్పించారు. ఈమేరకు ఆదివారం దేశ రాజధానికి మమతాబెనర్జీ చేరుకున్నారు. ఆమె వెంట తృణమూల్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, అడ్వకేట్ కూడా అయిన కల్యాణ్ బెనర్జీ ఉన్నారు.
సోమవారం ఉదయం బెంగాల్ నుంచి ఎస్‌ఐఆర్ బాధితులు తమ సమస్యలను ఎలెక్షన్ కమిషన్‌కు వివరించడానికి వచ్చారని, కానీ వారికి బెదిరింపులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంగ భవన్ ఆవరణలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని ఆమె ప్రశ్నించారు. సర్ బాధితులైన దాదాపు 50 కుటుంబాలు పశ్చిమబెంగాల్ నుంచి ఢిల్లీకి వచ్చారు.