Reading Time: 2 minutes

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద చేపట్టిన 2,160 మోడల్ ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ నిర్మాణాలను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ..గత ప్రభుత్వం నాటి ఒడిదొడుకులను ఎదుర్కొనేందుకే తమకు ఇప్పటిదాకా సమయం పట్టిందని, ఇంకా ఆ ప్రాజెక్టు విషయంలో అనేక లోపాలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే కమీషన్ వస్తుందని ఆలోచించిందే తప్ప పేదవాడికి ఇండ్లు కట్టించలేదన్నారు. గృహ నిర్మాణ శాఖను అస్తవ్యస్తం చేసిందని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో విడత, రానున్న రెండేళ్లలో 2 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలతో పాటు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతున్నారని,

అలాగే గతంలో గృహ జ్యోతి కింద మంజూరు చేసిన ఇండ్లను పూర్తి చేయాలని ఇతర పార్టీల ఎంఎల్‌ఏలు కోరారని, వాటిని కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. హుజూర్‌నగర్‌లో చేపట్టిన 2,160 ఇందిరమ్మ హోసింగ్ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ ఇళ్లను ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశం ఇచ్చామని తెలిపారు. గృహ నిర్మాణ పాలసీ ప్రకారం బహు పేదల నుండి ఇండ్లకు దరఖాస్తులను తీసుకొని మార్చి 31 లోపు వారికి ఇల్లు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సంక్రాంతి లోపు లేదా ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించి తుది జాబితా రూపొందించాలని చెప్పారు. అంతకుముందు మంత్రి హుజూర్‌నగర్ ఇందిరమ్మ ఇండ్ల కాలనీలో ఇండ్ల నిర్మాణాలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, గృహనిర్మాణ శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌తో సమీక్షించారు. ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2012లో తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హుజూర్‌నగర్ హౌసింగ్ కాలనీని మంజూరు చేయించానని గుర్తు చేశారు.

ప్రభుత్వ భూమి లేకపోయినప్పటికీ, దేవాదాయ శాఖ భూమి సుమారు 115 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి నిధులు చెల్లించి పనులు ప్రారంభించామని అన్నారు. కానీ గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా పనులు నిలిపివేసిందని, తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన, ప్రాధాన్య పథకాల కింద గృహ నిర్మాణాలను చేపట్టామని అన్నారు. హుజూర్‌నగర్ ఇందిరమ్మ కాలనీలో ఇండ్ల నిర్మాణంతో పాటు, పాఠశాల, అంగన్వాడీ, హెల్త్ సెంటర్ , కమ్యూనిటీ హాల్, ప్లే గ్రౌండ్ వంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని తెలిపారు. హుజూర్‌నగర్ హౌసింగ్ కాలనీ పూర్తికి ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్‌కు పూర్తి సహకారం అందిస్తామని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అన్నారు. అంతకుముందు మంత్రులు ఇందిరమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ గౌతం, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి సిద్దార్థ్, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర అధికారులు, నాయకులు దొంగరి వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, దేశ్ముఖ, తన్నీరు మల్లికార్జునరావు, గేల్లి రవి, దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కోతి సంపత్ రెడ్డి, ఆధర్ల శ్రీనివాస్ రెడ్డి, అజీజ్ పాషా, సైదా మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.