
సింగపూర్ / పాట్నా: ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముద్దుల మనవడు ఆదిత్య యాదవ్ సైనికుడు కానున్నాడు. సైన్యంలో చేరేందుకు అవసరం అయిన రెండేళ్ల మౌలిక సైనిక శిక్షణను ఇప్పుడు ఆయన సింగపూర్‌లో ఆరంభించాడు. ఈ రాజకీయాలు, కుటుంబ కలహాలు ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ఈ యువకుడు కొత్త బాట పట్టాడు. తన కుమారుడు ఆదిత్య సింగపూర్‌లో మిలిటరీ ట్రైనింగ్ కోర్సులో చేరినట్లు తల్లి రోహిణి ఆచార్య సామాజిక మాధ్యమంలో తెలిపింది.
అబ్బాయి ఫోటో కూడా జతచేశారు. వాడు సాహసి, ధైర్యవంతుడు, పట్టుదల, క్రమశిక్షణ గలవాడు. వాడిని అభినందిస్తున్నానని ఆమె స్పందించారు. ప్రి యూనివర్శిటీ డిగ్రీ తీసుకున్న తరువాత ఆదిత్య తన బిఎంటి కోర్సులో 18వ ఏట చేరాడు. కొడుకుకు సైన్యంలో చేరాలని ఉంది. ఇది తమకు గర్వకారణం అని తల్లి పుత్రోత్సాహం వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే పలు సవాళ్లను ఎదుర్కొనే శక్తి ఈ సైనిక వృత్తి ద్వారా సాధించుకుని తీరవచ్చుననేది తన కొడుకు ఆలోచన , ఇది యువతకు అవసరం అని స్పందించారు. కనీస సైనిక శిక్షణ కోర్సు చిన్న వయస్సులో పొందుతున్నాడు. వాడికి గ్రీటింగ్స్ చెప్పాలని కోరారు.