
గాయం కారణంగా క్రికెట్‌కి కొంతకాలంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్లియరెన్స్ ఇవ్వడంతో అతడు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాక.. ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ శార్ధూల్ ఠాకూర్‌కి గాయం కావడంతో అతడి స్థానంలో శ్రేయస్‌కి బాధ్యతలు అప్పగించారు. దీంతో లీగ్ దశలో ఆడే చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.
అయితే ఈ మ్యాచ్‌లు ముంబైకి మాత్రమే కాదు.. శ్రేయస్‌కి కూడా ఎంతో కీలకమే. ఈ రెండు మ్యాచుల్లో తన ఫిట్‌నెస్‌ని నిరూపించుకుంటేనే.. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని.. వన్డే జట్టును ప్రకటించినప్పుడే సెలక్టర్లు స్పష్టం చేశారు. ఇక ముంబై ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో గెలిచి ఎలైట్ గ్రూప్ సిలో 16 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 128 పరుగుల తేడాతో ఓడటంతో ఆ జట్టు రన్‌రైట్ బాగా పడిపోయింది. జనవరి 6న హిమాచల్‌ప్రదేశ్‌తో, 8న పంజాబ్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో ఒకదాంట్లో విజయం సాధించినా.. నాకౌట్ దశకు చేరుకుంటుంది.