
అమరావతి: ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఎదగాలన్నది ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యం అని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. దేశానికి యువత అడ్వాంటేజ్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు సిఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆయన ప్రసంగించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారికి, ప్రతిభ చూపిన వారికి, పూర్ణకుంభ వంటి అవార్డులు ఇచ్చారని, 1949లో హైదరాబాద్ లో ఆంధ్ర సారస్వత పరిషత్ గా ఎదిగిందని అన్నారు. 2017లో ఆంధ్ర సారస్వత పరిషత్ కు మళ్లీ ఊపిరిపోశారని, 2022 భీమవరంలో, 2024లో రాజమండ్రిలో మహాసభలు నిర్వహించారని చెప్పారు. సరైన సమయంలో సరైన నాయకుడు దేశాన్ని పాలిస్తున్నాడని, కృష్ణా నదిపై తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించామని తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు అని రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం ఉండాలని అన్నారు. దేశంలోనే తెలుగు భాషకు ఘనమైన చరిత్ర ఉందని, వందలాది భాషలు ఉన్నా.. మనదేశంలో కేవలం ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించిందని కొనియడారు. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు అని ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్లమంది తెలుగు మాట్లాడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మహాసభలకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని, ఇలాంటి మహాసభలు తెలుగు భాష పరిరక్షణకు ఉపయోగపడతాయని అన్నారు. గిడుగు వెంకట రామ్మూర్తిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదని, తాను తెలుగువాణ్ణి, తనది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ అని ప్రశంసించారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ ఇది అని వేదికకు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టిఆర్ పేరు పెట్టడం సంతోషదాయకరమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
నదీ జలాలపై సిఎం స్పందించారు: ఉమ్మడి రాష్ట్రంలో తన హయాంలో తెలంగాణలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని, కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు తాను అడ్డుపడలేదని, గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే ఎప్పుడూ అడ్డుచెప్పలేదని అన్నారు. నీటి విషయంలో కానీ.. ఏ ఇతర విషయాల్లో కానీ.. తెలుగువారు కలిసే ఉండాలని, వేల టిఎంసిల నీరు సముద్రంలో కలిసిపోతోందని తెలిపారు. గంగా, కావేరి కలవాలని.. దేశంలో సమస్య పూర్తిగా తీరాలని.. అదే తమ కోరిక అని చంద్రబాబు ఆశిస్తున్నారు.