
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డెమియన్ మార్టిన్ (54) ఆరోగ్య విషయంలో ఓ అద్భుతం జరిగింది. మెనినైటిస్‌తో బాధపడుతున్న ఆయనకు ఆ వ్యాధి కారణంగా ఇతర అవయవాలు దెబ్బ తినకుండా వైద్యులు మత్తు ఇచ్చి తాత్కాలికంగా కోమాలోకి పంపించారు. కోమా నుంచి బయటపడితే ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లే అని పేర్కొన్నారు. అయితే ఆయన కోమా నుంచి బయటపడ్డారు. గంట గంటకు ఆయన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
మార్టిన్ ఆరోగ్యం విషయం మెరుగుపడటంపై ఆయన స్నేహితుడు, ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక ‘మిరాకిల్’గా గిల్లీ అభివర్ణించారు. కోమా నుంచి బయటపడ్డాక మార్టిన్ అసాధారణంగా స్పందిస్తున్నాడని.. చక్కగా మాట్లాడగలుగుతున్నాడని గిల్లీ వెల్లడించారు. త్వరలోనే ఆయన్ను ఐసియు నుంచి బయటకు తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్టిన్ కోలుకోవాలని కోరుకున్న వాళ్లకి.. క్రికెట్ సమాజం చూపిన ప్రేమ, శ్రద్ధకి మార్టిన్ భార్య అమాండా కృతజ్ఞతలు తెలిపారు. మార్టిన్ ఆరోగ్యం కుదుటపడటంలో అందరి పాత్ర ఉందని ఆమె అన్నారు.
ఇక బ్యాటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మార్టిన్ 1992 నుంచి 2006 కాలంలో ఆసీస్ తరఫున ఆడారు. తన కెరీర్‌లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టి-20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4406, 5346, 120 పరుగులు సాధించాడు. మార్టిన్ ఆరోగ్యం నుంచి కోలుకోవడంపై ఆస్ట్రేలియా అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.