Reading Time: < 1 minute

కార్‌కస్: అమెరికా మాట వినకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ మండిపడ్డారు. అమె అధ్యకురాలిగా బాధ్యతలు చెపట్టిన వెంటనే ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. నికోలస్ మదురోను నిర్బంధించడం సరికాదని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి దేశంలో శాంతి ఉన్నప్పుడే ప్రపంచ శాంతికి అనుకూల వాతావరణం ఉంటుందని తెలిపారు. శాంతి స్థాపనకు కట్టుబడి ఉండడంతో పాటు బయట నుంచి ఎలాంటి ముప్పు లేకుండా అంతర్జాతీయ సహకారంతో గౌరవప్రదంగా జీవించాలని తాము కోరుకుంటున్నామన్నారు. అమెరికాతో పాటు అన్ని దేశాలతో మర్యాదపూర్వక స్నేహంతో పాటు సమతుల్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని డెల్సీ పేర్కొన్నారు. మా దేశ అభివృద్ధి కోసం అమెరికాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

 డెల్సీ విమర్శలపై ట్రంప్ స్పందించారు. అమెరికాకు వ్యతిరేకంగా చేసే పనులను తాము సహించబోమని, ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే దారుణంగా ఆమెను అణచివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. వెనుజులాపై అమెరికా నియంత్రణ ఉండాల్సిందేనని, అప్పుడే ఆ దేశాన్ని పునర్ నిర్మాణం చేయడం కుదురుతుందన్నారు. అమెరికా కోరుకున్నది ఆమె చేస్తే వెనుజులాలో మా బలగాల ఆధిపత్యం ఉండబోదన్నారు.