Reading Time: < 1 minute

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఒకప్పుడూ భారత క్రికెట్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిది ప్రత్యేక స్థానం. మూడు ఫార్మాట్‌లలోనూ కచ్చితంగా టీమిండియాలో ఉండేవాడు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కెప్టెన్‌లుగా ఉన్నప్పుడు షమికి తుది జట్టులో చోటు ఉండేదు. ఫార్మాట్ ఏదైనా బౌలింగ్‌ను షమి మాత్రమే ప్రారంభించే వాడు. అలాంటి షమికి కొంతకాలంగా టీమిండియాలో చోటే లేకుండా పోయింది. కారణం లేకుండానే అతన్ని టీమిండియాకు దూరంగా ఉంచుతున్నారు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌లు కావాలనే అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదనే విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ప్రస్తుతం భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులతో పోల్చితే షమి చాలా మెరుగైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫిట్‌నెస్ పేరుతో అతన్ని జాతీయ జట్టుకు దూరంగా ఉంచుతున్న సెలెక్టర్లు బుమ్రాను మాత్రం ప్రతి ఫార్మాట్‌లోనూ ఆడిస్తుండడం గమనార్హం.

బుమ్రాతో పోల్చితే ఫిట్‌నెస్‌లో షమి ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాడు. దీనికి అతను దేశవాళీ క్రికెట్‌లో చేస్తున్న ప్రదర్శనే నిదర్శనంగా చెప్పొచ్చు. రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 కప్, విజయ్ హజారే ట్రోఫీలో షమి అత్యంత మెరుగైన ప్రదర్శనతో అలరిస్తున్నాడు. రంజీల్లో సుదీర్ఘ ఓవర్లు వేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో వికెట్ల పంట పండించాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో నిలకడైన బౌలింగ్‌తో వికెట్లను పడగొడుతున్నాడు. ఇంత అద్భుతంగా రాణిస్తున్నా అతన్ని టీమిండియాకు ఎందుకు దూరంగా ఉంచుతున్నారో తెలియడం లేదు.

షమికి మరోసారి సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించారు. అతన్ని న్యూజిలాండ్‌తో జరుగనున్న టి20, వన్డేల సిరీస్‌కు దూరంగా ఉంచారు. రెండు సిరీస్‌లలో కూడా షమి పేరును పరిణలోకి దీసుకోలేదు. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు చీఫ్ సెలెక్టర్ అగార్కర్, ప్రధాన కోచ్ గంభీర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు షమిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే విషయం మరోసారి రుజువైందని దిలీప్ వెంగ్‌సర్కార్, ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్, గంగూలీ, మనోజ్ తివారీ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అగార్కర్, గంభీర్‌లు షమి కెరీర్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే అతన్ని టీమిండియాకు దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు.