
ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక మూవీ ‘గాంధీ టాక్స్’ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ జనవరి 30న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఇండియన్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్గా ‘గాంధీ టాక్స్’ రూపొందింది. కథను వివరించటానికి మాటల కంటే నిశ్శబ్దం బలమైన అంశంగా నిలుస్తోంది. ఇది సినీ ప్రపంచంలో ధైర్యమైన, సృజనాత్మకమైన అడుగు. సినిమాను ఎంత గ్రాండియర్‌గా, ఎలాంటి సౌండ్‌తో రూపొందించారంటూ లెక్కలు వేసే నేటి రోజుల్లో గాంధీ టాక్స్ సినిమా తన సందేశాన్ని శాంతియుతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా, భావోద్వేగాలతో చెప్పబోతుంది.
ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ వంటి అద్భుతమైన నటీనటులు నటించారు. వీరందరూ తమ హావభావాలతో, నటనతో స్టోరీని అందరికీ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కిషోర్ బెలేకర్ మాట్లాడుతూ “నిశ్శబ్దం ను నమ్మి గాంధీ టాక్స్ సినిమా ను రూపొందించాం. నటీనటులు ఈ కొత్త ప్రయత్నంలో భాగం కావటానికి ముందుకు రావటంతో పాటు సున్నితమైన భావాలను చక్కగా పలికించారు. అదే సమయంలో ఎ.ఆర్.రెహమాన్గారి సంగీతం.. సినిమా కథను చెప్పే వాయిస్గా మారింది. జీస్టూడియోస్, మీరా చోప్రా సహకారంతో ధైర్యంగా, నిజాయతీగా కొత్త ప్రయత్నాన్ని చేశాం ” అని అన్నారు. జనవరి 30న ఈ చిత్రం విడుదలకానుంది.