Reading Time: 2 minutes

దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ తెల్వదు

ఉరిశిక్షల గురించి మాట్లాడుతున్న రేవంత్, రాహుల్ గాంధీని ముందు ఉరితీయాలి

కాంగ్రెస్ పాలనలో పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప అభివృద్ధి ఏదీ?

2014 వరకు నిరాటంకంగా పాలించిన కాంగ్రెస్, టిడిపిల వల్లే నదీజలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: ఉరిశిక్షల గురించి మాట్లాడుతున్న రేవంత్‌ను, రాహుల్ గాంధీని ముందుగా ఉరి తీయాలంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అశోక్ నగర్ అడ్డా మీద రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్ గాంధీని ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అని.. 420 హామీలు ఇచ్చి ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 సార్లు ప్రజలు శిక్షించాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ‘నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు’ పేరిట బిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు, కొనసాగుతున్న అన్యాయాల పరంపర, వాటి వల్ల తెలంగాణ ఎదుర్కొన్న నష్టాలను వివరంగా ప్రజల ముందుంచే ప్రయత్నమే బిఆర్‌ఎస్ ప్రజెంటేషన్ ఉద్దేశం అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి ఒక్క భాషే వచ్చని.. తమకు మూడు నాలుగు భాషల్లో తిట్టుడు వచ్చంటూ హెచ్చరించారు.

రేవంత్‌రెడ్డికి ఐఐటికి, ఐఐఐటికి తేడా తెలియదని, బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియని విమర్శించారు. అలాంటి వ్యక్తి తెలంగాణ భవితవ్యంపై మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తికి తెలంగాణకు ఏం కావాలో ఎలా తెలుస్తుందని అడిగారు. రేవంత్‌కు బేసిన్ తెల్వదు బేసిక్స్ తెల్వదు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని అజ్ఞాని, ఉష్ట్రపక్షి పాలన ఇది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికే వందలాది రైతులు, ఆటో డ్రైవర్లు, గురుకుల విద్యార్థులు, నేతన్నలు ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని కెటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులపై తుపాకీ ఎత్తిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్నారు.

కరువు నేలల్లో సిరులు పండించిన కెసిఆర్

శాసనసభలో జరుగుతున్న చర్చల తీరును, ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత పెద్దలు చెప్పిన మాట ‘వినాశకాలే విపరీత బుద్ధి’ గుర్తుకు వస్తోందని కెటిఆర్ అన్నారు. అధికార మదంతో విర్రవీగుతూ, అహంకారంతో, పరుషమైన మాటలతో మాట్లాడటం ప్రజాస్వామ్యానికి అవమానం అని పేర్కొన్నారు. పదే పదే చావు, ఉరిశిక్షలు అంటూ రైతుబంధు వంటి మానవీయ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచిన కెసిఆర్‌పై అనరాని మాటలు అనడం దుర్మార్గం అని మండిపడ్డారు. తెలంగాణ ముక్తి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన నాయకుడు కెసిఆర్ అని, తన చావునే తలపెట్టి తెలంగాణ బతుకును కోరిన త్యాగధనుడు అని గుర్తుచేశారు. కరువు నేలల్లో సిరులు పండించి, మరణ మృదంగాలు మోగిన ప్రాంతాల్లో జీవకళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు కెసిఆర్ అని కొనియాడారు.