Reading Time: 2 minutes

రాయలసీమ లిఫ్ట్ పనులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. ఖండించిన ఏపీ

జగన్ హయాంలో అనుమతులు లేకుండారాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు

ఏపీ నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదన్న ఏపీ

మన తెలంగాణ / అమరావతి : తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుబట్టింది. తన విన్నపం మేరకు తనపై గౌరవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ నిలిపి వేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం అని తెలిపింది. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా నాటి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టిందని వెల్లడించింది. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా జగన్ పనులు చేపట్టారని, నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేసింది.

కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్‌జిటి సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనుల నిలిపివేయాలని 2020లోనే ఎన్‌జిటి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయని స్పష్టం చేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని వెల్లడించింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ ఆ రాష్ట్రంలోని అధికార, విపక్షాలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని కూటమి ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో వాస్తవాలు బయటపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

వైఎస్‌ఆర్‌సీపీ నిర్వాకం వల్ల నిలిచిపోయిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎన్జీటీలో కూటమి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఏర్పాటు అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయని గుర్తుచేసింది. కూటమి ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వాదనలను వినిపిస్తోంది. గత ఏడాది మార్చిలోనే ఎన్జీటీలో ఏపీ ఇరిగేషన్ శాఖ కౌంటర్ దాఖలు చేయగా ఈ నెల 22న రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అంశం ఎన్‌జిటిలో విచారణకు రానుంది. సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుంటే పనులు చేపట్టవద్దంటూ 2020 జులైలో కేఆర్‌ఎంబీ స్పష్టం చేయడంతో పాటు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని 2021లో ఆదేశించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుచేసింది.