Reading Time: 3 minutes

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై టెన్షన్..టెన్షన్

‘దానం’ కేసు నిర్ణయంపై ఉత్కంఠ

రాజీనామానే శరణ్యమంటున్న నేతలు

కడియం సేప్ జోన్‌లో ఉన్నట్లేనా ?

కాలె, పోచారం, సంజయ్‌పై త్వరలో తీర్పు

16న సుప్రీంలో స్పీకర్ ధిక్కారణ పిటిషన్‌పై విచారణ

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ రాజకీయవర్గాల్లో కొనసాగుతున్నది. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానంటూ బాజప్తా చెబుతున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటు పడనున్నదా? లేక వేటు పడడానికి ముందే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతున్నది.

తమ పార్టీ తరపున ఎన్నికైన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ గత ఏడాది అక్టోబర్ నుంచి విచారణ చేపట్టి ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గూడం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు పార్టీ ఫిరాయించలేదని తీర్పు చెప్పారు. కాగా, మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కె. సంజయ్యపై విచారణ పూర్తయినా తీర్పు ‘రిజర్వ్’లో ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లోగడ స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసుకు స్పందిస్తూ సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు కావాలని కోరిన సంగతి తెలిసిందే.

లాఉండగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ రేపుతున్నది. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ కొంత కాలానికి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో దానం పార్టీ మారారన్న విషయం బహిరంగ రహస్యమైంది. కాబట్టి దానంపై తప్పని సరిగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (పదవ షెడ్యూలు) ప్రకారం అనర్హత వేటు వేస్తారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు.

వేటుకు ముందు రాజీనామానే..

ఈ ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మరో మార్గం చెబుతున్నారు. స్పీకర్ నిర్ణయానికి ముందే (అంటే ఒక రోజు కావచ్చు, లేదా ఒక గంట ముందు కావచ్చు) దానం నాగేందర్ తన శాసనభ్యత్వానికి రాజీనామా చేస్తారని అంటున్నారు.

దానంకు కలిగే లాభం ఏమిటీ ?

స్పీకర్ తీర్పు వెలువరించడానికి ముందే దానం రాజీనామా చేస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం కలుగుతుంది. సదరు సభ్యుడు రాజీనామా చేసినందున స్పీకర్ ముందుగా ఆ రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. రాజీనామా చేశాక, ఆమోదించిన తర్వాత తీర్పు ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోతుంది. గతంలో ఇలా జరిగిన సందర్భాల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో, ఇతర రాష్ట్రాల్లోనూ జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అప్పటి టిఆర్‌ఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు ఓట్లు వేశారు.

దీనిపై టిఆర్‌ఎస్ (బిఆర్‌ఎస్) దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అప్పటి స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించడానికి ముందే ఇరువురు ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. వాటిని స్పీకర్ ఆమోదించక తప్పలేదు. వారిపై అనర్హత వేటు వేశానన్న ఫలితం ఉండదు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజీనామా చేయకుండా అనర్హత వేటు వేసినట్లయితే సదరు సభ్యుడు ఆరు సంవత్సరాల వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు అవుతారు. ఆరేళ్ళు అంటే ప్రస్తుత కాలంతో పాటు ఐదేళ్ళకూ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అర్హత ఉండదు. పేరు ఆరేళ్ళు అయినా, ప్రస్తుత కాలంతో పాటు వచ్చే ఐదేళ్ళూ కలిపితే ఆరేళ్ళకు ఎక్కువే అవుతుంది. సురేష్ రెడ్డి తన విచారణ ముగించి తీర్పు ఇచ్చినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, మందాడి సత్యనారాయణ రెడ్డిపై అనర్హత వేటు వేశారు.

రాజీనామానే శరణ్యం..

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసినందున స్పీకర్ తప్పని సరిగా దానంపై వేటు వేస్తారని అన్ని రాజకీయ పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేయడమే ఉత్తమమని అంటున్నారు. దానం ఏ నిమిషంలోనైనా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తారన్న చర్చ జరుగుతున్నది. అందుకే దానం బహిరంగంగా తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ధీమాగా చెబుతున్నారని అంటున్నారు. ఇకపోతే లోగడ దానం తనకు సమాధానం చెప్పేందుకు గడువు కావాలని కోరినందున, స్పీకర్ ఎదుట హాజరై తన వాదన వినిపించాల్సి ఉంటుంది.

కడియం కూడా సేఫ్ జోన్‌లోనే

పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి ఇటీవల స్పీకర్‌కు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తాను పార్టీ మారలేదని, ప్రతి నెలా తన జీతం నుంచి బిఆర్‌ఎస్-లెజిస్లేచర్ పార్టీ కార్యాలయానికి కొంత సొమ్మును జమ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇటీవల తీర్పు ఇచ్చినప్పుడు కూడా వారు పార్టీ ఫిరాయించినట్లు పిటిషననర్లు సాక్షాధారాలు చూపింలేదని పేర్కొన్నారు. పార్టీలో కొనసాగుతున్నారనడానికి కౌంటర్ పిటిషనర్లు సరైన ఆధారాలు చూపించారని స్పీకర్ పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు కడియం విషయంలోనూ అదే జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేలపై త్వరలో తీర్పు

ఇదిలాఉండగా ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పాల్సి ఉంది.

16లోగా ఏమి జరగబోతోంది..

ఇదిలాఉండగా మిగిలిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 16లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని, మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు లోగడ ఇచ్చిన ఆదేశాన్ని సైతం లెక్క చేయడం లేదంటూ బిఆర్‌ఎస్ సుప్రీం కోర్టులో కంటెంప్ట్ (ధిక్కరణ) కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 16న సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనున్నది తెలుస్తోంది.

పూర్వాపరాల్లోకి వెళితే..

పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికైన కొత్తలోనే క్రమేణా కాంగ్రెస్‌లోకి వెళ్ళారన్నది ఆ పార్టీ అభియోగం. అయితే తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించారన్న ఆరోపణనూ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా తాము చేసిన వినతిని స్పీకర్ ప్రసాద్ కుమార్ పెడచెవిన పెట్టారంటూ ఆ పార్టీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. అందుకు హైకోర్టు ఈ విషయంలో స్పీకర్‌ను ఆదేశించలేమని, కాకపోతే త్వరితగతిన కేసు ముగించాల్సిందిగా సూచన చేయగలమని పేర్కొంది. దీంతో బిఆర్‌ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు సెప్టెంబర్‌లో ఆదేశించడంతో, స్పీకర్ అక్టోబర్ మొదటి వారం నుంచి కేసును విచారణ చేపట్టారు. ఆ గడువు గత నెలలో ముగియడంతో తమకు అసెంబ్లీ సమావేశాలు ఉండడం, తాను కామన్‌వెల్త్ పార్లమెంటరీ సమావేశాలకు వెళ్ళాల్సి రావడం వల్ల కేసు విచారణ పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదని, మరో రెండు నెలల గడువు కావాలని అభ్యర్థిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్‌పై బిఆర్‌ఎస్ దాఖలు కంటెంప్ట్ పిటిషన్‌తో పాటు, స్పీకర్ అభ్యర్థనపై సుప్రీం విచారణ చేపట్టనున్నది.