
మెక్సికో, క్యూబా, కొలంబియాలకు వెనెజువెలా గతే.. ట్రంప్ గర్జన
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాలుగా మారాయి
దేశాధినేతలు నియంత్రించలేకపోతున్నారు
మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి
అమెరికా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు
వెనెజువెలాలో మాదే పాలన
అక్కడి అపార చమురు నిల్వలను వాడుకుంటాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: వెనెజువెలాపై కఠిన చర్య అనంతరం అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మెక్సికో, క్యూబా, కొలంబియా కూడా అమెరికా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. భవిష్యత్ లో దాడులకు ఈ దేశాలు లక్ష్యం కావచ్చునని తీవ్ర వార్నింగ్ జారీ చేసారు. వెనెజువెలాపై శనివారం నాడు తెల్లవారు జామున భారీగా విరుచుకుపడి, సైనికచర్య అనంతరం ప్రెసిడెంట్ నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించి తరలించిన విషయం తెలిసిందే.ఈ ప్రాంతంలో నార్కో టెర్రరిజం, మాదకద్రవ్యాల ప్రభావం పెచ్చుపెరుగుతున్న నేపథ్యంలో మెడలు వంచుతామని హెచ్చరించిన అనంతరం వెనెజువెలాపై సైనిక చర్య జరిగింది. ఆ దేశాలు కూడా కోకైన్ ను ఉత్పత్తి చేసి అమెరికాకు దొంగచాటుగా సరఫరా చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
వెనెజువెలాపై ఆపరేషన్‌ను క్యూబా ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న ప్రశ్నకు, ప్రస్తుతం క్యూబానే దెబ్బతినే అవకాశం ఉందని, క్యూబాపై కూడా దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు ట్రంప్ అన్నారు. కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో కు ప్రత్యేకంగా ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కొలంబియాలో మూడు కోకైన్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వారు మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేసి అమెరికాకు సరఫరా చేస్తున్నాయని, పెట్రో ఆ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ట్రంప్ పేర్కొన్నారు. వెనెజువెలా కు చెందిన మదురో కు మిత్రుడైన పెట్రో ఓ ప్రకటనలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి, ఐక్యరాజ్యసమితి సూత్రాలకు వ్యతిరేకంగా, వెనెజువెలా పై దాడులకు తెగపడ్డారని, అమెరికా దాడులలో దక్షిణ ప్రాంతంలో పౌరులను టార్గెట్ చేసిందని ఆరోపించారు.
ఇక మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్ బామ్ దేశంలో మాదకద్రవ్యాల మాఫియాను కంట్రోల్ చేయలేకపోతున్నారని, ఆ మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయని, ఆమెకు కార్టెల్స్ అంటే చాలా భయం అని ప్రెసిడెంట్ అన్నారు. వెనెజువెలాపై దురాక్రమణను పలు ఆంతర్జాతీయ దేశాలు ఖండించాయి. అమెరికా చర్య ఈ ప్రాంతంలో ప్రాంతీయ సుస్థిరతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నాయి. లాటెన్ అమెరికా దేశాలు, కరేబియన్ దేశాలు శాంతికి నెలవు అనీ, పరస్పరం గౌరవంతో శాంతియుత పరిష్కారాలను కనుగొంటున్నాయని పేర్కొన్నాయి. అమెరికా లో పలువురు కాంగ్రెస్ సభ్యులు, డెమోక్రటిక్ లు ట్రంప్ చర్యను విమర్శించారు. ట్రంప్ అనవసర యుద్ధానికి తెరలేపారని దుమ్మెత్తి పోశారు.
డెల్సీకి మద్దతు లేదు.. మేరియా కుదరదు
వెనెజువెలా తదుపరి అధ్యక్షులు ఎవరు అవుతారనే విషయంపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ సస్పెన్స్ మిగిల్చారు. దేశానికి చెందిన మహిళా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి గ్రహీత మేరియా కొరినా మచాడో తదుపరి నేత అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఇక ఇప్పటి ఉపాధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగ్యూ ప్రెసిడెంట్ అయితే బాగుండని తాము అనుకుంటున్నామని చెప్పారు. అయితే ఆమెకు ఈ కీలక బాధ్యతలు చేపట్టే సమర్థత లేదని స్పష్టం అయిందన్నారు. పైగా ప్రజలలోమద్దతు లేదు. ఆమె పట్ల సరైన గౌరవం లేదని , అయితే మంచి వ్యక్తి అని, కానీ ఏం లాభం, ప్రజల మద్దతు అవసరం కదా అన్నారు. ఇంతకు తదుపరి పగ్గాలు ఎవరికి అనేది తేల్చిచెప్పలేదు. దీనిపై ట్రంప్ మరింత ఉత్కంఠత పెంచారు.