
భోగాపురం విమానాశ్రయంలో విజయవంతంగా తొలి విమానం ల్యాండింగ్
ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చిన ఎయిరిండియా వ్యాలిడేషన్ ఫ్లైట్
జూన్‌లో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపిన జీఎంఆర్
ఎన్డీఏ హయాంలోనే విమానాశ్రయానికి ప్రణాళికలు వేశామన్న ఏపీ సీఎం చంద్రబాబు
మా పునాది వల్లే ఈ మైలురాయి అంటూ భోగాపురం ఎయిర్ పోర్టుపై జగన్ ట్వీట్
ఆర్థిక రాజధానిగా విశాఖ తూర్పు తీరం : పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
మన తెలంగాణ / అమరావతి :- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివారం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ – అయ్యింది. కూటమి ప్రభుత్వ కృషితో నిర్దేశిత గడువుకన్నా ముందే భోగాపురం నుంచి విమానయానం అందుబాటులోకి రానుంది. నేడు ట్రయల్ రన్ నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాల సంసిద్ధత దిశగా అడుగులు వేస్తూ, వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త గ్రీన్ ఫీల్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిని సూచిస్తుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, జీఎంఆర్ గ్రూప్ నాయకత్వం సమక్షంలో ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్‌ను నిర్వహించారు.
ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏవియేషన్ అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం జరిగిన ఈ విమాన ప్రయాణం విజయవంతం కావడంతో విమానాశ్రయ రన్‌వే, సిగ్నల్ వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లన్నీ పక్కాగా ఉన్నాయని స్పష్టమైంది. విమానాశ్రయానికి అధికారిక ఏరోడ్రోమ్ లైసెన్స్ రావడానికి ఇది అత్యంత కీలకం. సాధారణ ప్రయాణికుల కోసం వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించాలంటే ఈ ప్రక్రియ పూర్తికావడం తప్పనిసరి.
ఆర్థిక రాజధానిగా విశాఖ తూర్పు తీరం :రామ్మోహన్ నాయుడు
ఏపీ అభివృద్ధిలో నేడు ఒక దారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని, విశాఖపట్నం తూర్పు తీరం ఆర్థిక రాజధానిగా మారనుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధికి ఒక శక్తివంతమైన ఇంజిన్‌గా పనిచేస్తుందన్నారు. ఇది ఉపాది అవకాశాలను సృష్టించడంతో పాటు పరిశ్రమలను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజలకు, వ్యాపారాలకు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, ఈ విమానాశ్రయం వాణిజ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు ఎగుమతులను పెంచుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పర్యాటక సామర్ధ్యాన్ని వెలికితీస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఈ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన, వాణిజ్య పటంలో సుస్థిరంగా నిలుపుతుందని ఆకాంక్షించారు. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూర్చేలా ఆధునిక, సమగ్ర వృద్ధి ఆధారిత విమానయాన మౌలిక సదుపాయాలను నిర్మించాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు ఇది నిదర్శనమన్నారు. అందుకు అనుగుణంగా ఉన్న ఈ జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసినందుకు, అంకితభావంతో పనిచేసిన భాగస్వాములందరినీ అభినందిస్తున్నానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఎన్డీఏ హయాంలోనే విమానాశ్రయానికి ప్రణాళికలు : ఏపీ సీఎం
భోగాపురం గ్రీన్‌ఫీల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014 -19 మధ్య ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ప్రణాళికలు రచించి, పనులు ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కొత్త మైలురాయి అని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో వచ్చే జూన్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారానికి, ఆయన దార్శనికతకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. భోగాపురం విమానాశ్రయంలో విమాన రాకపోకలకు సంబంధించి నిర్వహించిన వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మా పునాది వల్లే ఈ మైలురాయి.. భోగాపురం ఎయిర్ పోర్టుపై జగన్ ట్వీట్
విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయి అని, విజన్ వైజాగ్ లక్ష్య సాధన దిశగా పడిన కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత దశకు చేరుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలో వేసిన బలమైన పునాదే కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ ‘మా పాలనా కాలంలో ఈ ప్రాజెక్టుకు వేగవంతమైన అనుమతులు సాధించాం. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రాజెక్టుకు పటిష్ఠమైన పునాది వేశాం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషే ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకోవడానికి ముఖ్య కారణం‘ అని వివరించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్‌కు జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విశాఖపట్నం పోర్టును భోగాపురం విమానాశ్రయంతో అనుసంధానించే బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 2023 మార్చిలో ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.