
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీలో నదీజనాలలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టుకథలు, రేవంత్ రెడ్డి పిట్టకథలు చెప్పారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ నీటి హక్కులను కాపాడింది కెసిఆర్, బిఆర్‌ఎస్ ప్రభుత్వమని చెప్పారు. లోపాయికారి ఒప్పందాలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ సొంత రాష్ట్రంగా ఉండి ఉంటే ప్రాజెక్టులు పూర్తయ్యేవని, నల్లగొండ ఫ్లోరైడ్ బాధలు, పాలమూరు వలసల బాధలు తప్పేవి అని పేర్కొన్నారు. తెలంగాణను ఎపిలో కలిపి పాలమూరుకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఫజల్ అలీ కమిషన్ చెప్పినా వినకుండా తెలంగాణను ఎపిలో కలిపి.. తెలంగాణకు ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్సే అని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలోనూ కాంగ్రెస్ అన్యాయం చేసిందని, 11వ షెడ్యూల్‌లో పాలమూరు- రంగారెడ్డి పెట్టలేదని చెప్పారు. తెలంగాణకు నెంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ పేరిట హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తాను పిపిటి ఇచ్చేది రాజకీయాల కోసం కాదు అని, ప్రజల కోసం సాక్ష్యాధారాలతో వివరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం 79 శాతం ఉంటే, మనకు ఇచ్చేది 15 శాతమే అని గుర్తు చేశారు.
తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతం 69 ఉంటే, మనకు వచ్చింది 34 శాతమే అని పేర్కొన్నారు. విభజన చట్టంలో కూడా తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనలో పాలమూరు, డిండి ప్రాజెక్టను చట్టంలో కల్పించకుండా నష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్సే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించి, గోదావరి- బనకచర్లకు రేవంత్‌రెడ్డి ఒప్పకున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరంపై కక్ష కట్టి, పాలమూరుపై పగపట్టారని మండిపడ్డారు. రెండు పిల్లర్లు కుంగితేనే కాళేశ్వరాన్ని పక్కన పెట్టారని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు
అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి నాలుక కోయాలని హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభను రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రమాణం చేసిన దేవుడినే మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి అసెంబ్లీలో దేవుడి మీద ఆన అని మాట్లాడారని విమర్శించారు. గోదావరి నదిలో నిజాం కాలంలో మనకు దక్కినది 252 టిఎంసిలే అని, 60 ఏళ్లు గోదావరి నదిలో 265.69 టిఎంసిలు సాధించారన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో 383 టిఎంసిలు సాధించామని చెప్పారు. కాంగ్రెస్, టిడిపి సాధించిన టిఎంసిల కన్నా ఎక్కువ సాధించినట్లు తెలిపారు. 811 టిఎంసిల్లో 299 టిఎంసిలే నికర జలాలని స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టాలంటే చాలా అనుమతులు తీసుకోవాలని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం చేశారని తెలిపారు.
బిఆర్‌ఎస్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఎక్కువ నీళ్లు వాడుకున్నట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన రేవంత్‌రెడ్డి వెంటనే రాజ్ భవన్‌కు వెళ్లి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తాను ఇలా మాట్లాడినందుకు తనపై దాడి చేయిస్తారని, అక్రమ కేసులు కూడా పెట్టిస్తారని, ఇవి కాకుండా అవసరమైతే హత్యాయత్నం కూడా చేయిస్తారని అన్నారు. అయినా తాను భయపడబోనని తేల్చి చెప్పారు. వరద బాధితులను పరామర్శించడానికి ఖమ్మం వెళ్తే రాళ్లదాడి చేయించారని ఆక్షేపించారు.
రేవంత్‌రెడ్డి సొంత ప్రాంతానికే ద్రోహం చేస్తున్నారు
పాలమూరుకు కాంగ్రెస్, టిడిపి చేసిన ద్రోహాలను రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు మేలు జరుగుతుందని కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారని అన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల మాదిరిగా ఆ ప్రాజెక్ట్‌ను ముందుకు కదవలనివ్వడం లేదని ఆరోపించారు. రెండేళ్లలో చిన్న కాల్వ మట్టి తవ్వితే 50 టిసిఎంల నీటిని నింపుకునే అవకాశం వదిలేసి తమపై రాజకీయంగా దుమ్మెత్తిపోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి సొంత ప్రాంతానికే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఎపిలో కలవక ముందు తెలంగాణలో 16.03 లక్షల ఆయకట్టు ఉందని, ప్రస్తుతం 48.74 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించామని చెప్పారు. 2004 నుంచి -14 మధ్య కాంగ్రెస్ 5.71 లక్షల ఎకరాల ఆయకట్టే సాధించిందని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో 17.24 లక్షల ఎకరాల ఆయకట్టు తెచ్చినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్-2కు నీళ్లు అందించామని, కాంగ్రెస్ తెచ్చిన ఆయకట్టు కన్నా ఏడున్నర రెట్లు బిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిందని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి
రాయలసీమ ఎత్తిపోతలను ఆపిందే తానేనని అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చెప్పారని..కానీ, కానీ రేవంత్ వ్యాఖ్యలు ఖండిస్తూ ఎపి ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని హరీష్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్‌రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు..బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్‌జిటికి వెళ్లి స్టే తెచ్చిందని ప్రకటనలో పేర్కొందని అన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు, శాసనసభను తప్పుదోవ పట్టించిన రేవంత్ రెడ్డి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జిఒ 2020 మే 5న వచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు జిఒ రాకముందే అపెక్స్ కౌన్సిల్‌లో తాము ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆనాడే అభ్యంతరం చెప్పామని అన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతలపై కెసిఆర్ గట్టి పోరాటం చేశారని, కెసిఆర్ ప్రయత్నాల వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని ఎపి ప్రభుత్వానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు.
299 టిఎంసిలకు కెసిఆర్ ఒప్పకున్నారని అబద్ధాలు చెబుతున్నారు
అపెక్స్ కౌన్సిల్ డాక్యుమెంట్‌లో తనకు కావాల్సింది మాత్రమే రేవంత్‌రెడ్డి చదివారని హరీష్‌రావు మండిపడ్డారు. కెసిఆర్ ఇచ్చిన లేఖలో ఆయనపై నెపం నెట్టే విధంగా అవసరమైన పేరాలను, వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి అసెంబ్లీ చదివారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి పేరా చదవకుండా రెండో పేరా చదువారని ఎద్దేవా చేశారు. పాలమూరు, డిండి ఎత్తిపోత పథకాన్ని కొనసాగిస్తామని, గోదావరిలో మిగులు జలాలపై కూర్చొని మాట్లాడుకుందామని కెసిఆర్ చెప్పారన్నారు. టెలిమెట్రీ పెట్టాలని 2016లోనే అడిగారని పేర్కొన్నారు. 299 టిఎంసిలకు కెసిఆర్ ఒప్పకున్నారని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ దాచి.. సగం పేరాగ్రాఫ్‌లు మాత్రమే చదివి రేవంత్‌రెడ్డి మోకాలు, బోడిగుండుకు ముడిపెట్టేలా మాట్లాడారని మండిపడ్డారు. తాత్కాలిక అరేంజ్‌మెంట్‌కు ఒప్పుకుంటే, అగ్రిమెంట్‌కు ఒప్పుకున్నట్లు రేవంత్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో చంద్రబాబు, జగన్‌లతో పాటు మోడీని సైతం కెసిఆర్ నిలదీశారని తెలిపారు. పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్ దగ్గర ప్రాజెక్టు కడతామని హెచ్చరించారని చెప్పారు.మొదటి అపెక్స్‌కౌన్సిల్‌లో 299కి కెసిఆర్ ఒప్పుకుంటే, ఇంకెప్పుడు టిబ్యునల్ వేస్తారని నిలదీస్తారా ..సుప్రీంకోర్టుకు వెళ్తారా ..? అని ప్రశ్నించారు.
కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులు మేం రన్నింగ్ ప్రాజెక్టులు చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత తమది అని పేర్కొన్నారు. కల్వకుర్తిలోనే 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని, కృష్ణాలో 50:50 ఇవ్వాలని తాము 28 లేఖలు రాశామని తెలిపారు. తాము మరణశాసనం రాశామని కాంగ్రెస్ అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. ప్రతి నిమిషం కెసిఆర్ కేంద్రంపై పోరాడారని, ప్రధానికి లేఖలు రాశారని చెప్పారు. కేంద్రం మెడలు వంచి ఒప్పించి కృష్ణాజలాల పున:పంపిణీకి సెక్షన్ -3 సాధించిందే కెసిఆర్ అని వెల్లడించారు. 2023లోనే 66.34 లేకుండానే అగ్రిమెంట్ చేశామని, కాంగ్రెస్ వచ్చాక మళ్లీ 66:334కు ఒప్పుకుందని అన్నారు. సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునః పంపిణీ జరగనుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69 శాతం నీళ్లు రావాలని కెసిఆర్ కేంద్రానికి లేఖ రాశారని, సెక్షన్ 3 కోసం 32 లేఖలు రాశారని చెప్పారు. కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3 సాధిస్తేనే..నీళ్ల పంపిణీపై ట్రిబ్యునల్ దగ్గర వాదనలు కొనసాగుతున్నాయని అన్నారు.
నేరం చేసేది కాంగ్రెస్.. నెపం నెట్టేది బిఆర్‌ఎస్ మీద
నేరం చేసేది కాంగ్రెస్.. నెపం నెట్టేది బిఆర్‌ఎస్ మీద అని -హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీజలాల విషయంలో కాంగ్రెస్ అన్యాయంపై ప్రశ్నిస్తాం, ప్రజాక్షేత్రంలో ఎంగడుతాం అని వెల్లడించారు. ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం..అవసరమైతే మరో జల పోరాటానికి బిఆర్‌ఎస్ శ్రీకారం చుడుతుందని వెల్లడించారు. తమకు అధికారం ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజల హక్కులు ముఖ్యం అని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం బిఆర్‌ఎస్ పోరాడుతుందని -హరీష్ రావు తెలిపారు.